
అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి
మడకశిర: దళిత విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించి, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మడకశిర పర్యటనకు వచ్చిన ఎస్పీ రత్నను వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, దండోరా నాయకుడు గంగాధర్, వైఎస్సార్‌సీపీ నాయకులు రంగనాథ్, సికిందర్ తదితరులు కలసి వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో దళితులకు రక్షణ కరువైందని, దళితుల సమస్యలపై హోంమంత్రికివినతి పత్రం ఇవ్వడానికి వెళుతుంటే పోలీసులు అడ్డుకోవడం అన్యాయమని అన్నారు. దళిత మహిళలు, విద్యార్థినులపై జరుగుతున్న లైంగిక దాడులు, దౌర్జన్యాలను అరికట్టాలని, బాధ్యలైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.
26 నుంచి
‘హనుమాన్ దర్శన్’
● ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు
పుట్టపర్తి టౌన్: శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అనంతపురం జిల్లాలోని మురడి, నేమకల్లు, కసాపురం గ్రామాల్లో వెలసిన ఆంజనేయస్వామి ఆలయాలను ఒకే రోజు సందర్శించుకునేలా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు జిల్లా ప్రజారవాణాధికారి మధుసూదన్ సోమవారం వెల్లడించారు. ఈ నెల 26 నుంచి ప్రతి శని, మంగళవారాల్లో హనుమాన్ దర్శన్ పేరుతో జిల్లాలోని అన్ని డిపోల నుంచి బస్సులు బయలుదేరుతాయి. ఈ నెల 26, 29, ఆగస్టు 2, 5, 9, 12, 16, 19 బస్సులు బయలుదేరుతాయి. రద్దీకి అనుగుణంగా 50 మంది ఒకే బ్యాచ్‌గా ప్రయాణించాలనుకుంటే వారి ప్రాంతానికే ప్రత్యేకంగా బస్సును పంపిస్తారు. పూర్తి వివరాలకు ధర్మవరం (99592 25859), హిందూపురం (99592 25858), కదిరి (99592 25860), మడకశిర (99592 25865), పెనుకొండ (99592 29966), పుట్టపర్తి (99592 25857) డిపో మేనేజర్లను సంప్రదించవచ్చు.

అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి