
గడువులోపు పనులన్నీ పూర్తి కావాలి
● పంచాయతీరాజ్ సీఈ అశోక్‌కుమార్
● ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో
ఏపీఆర్‌ఆర్‌పీ రోడ్ల పురోగతిపై సమీక్ష
● హాజరైన ఉమ్మడి జిల్లాల పీఆర్ ఇంజినీరింగ్ అధికారులు
అనంతపురం సిటీ: ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్స్ ప్రాజెక్ట్ (ఏపీఆర్‌ఆర్‌పీ) కింద మంజూరైన పనులన్నీ వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకల్లా పూర్తి చేయాల్సిందేనని సంబంధిత అధికారులను ఆ విభాగం ప్రాజెక్ట్ డైరెక్టర్, సీఈ అశోక్‌కుమార్ ఆదేశించారు. ఏపీఆర్‌ఆర్‌పీ రోడ్ల పురోగతిపై సీఈ కార్యాలయ ఈఈ రమణమూర్తితో కలసి అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలకు సంబంధించిన పీఆర్ ఇంజినీరింగ్ అధికారులతో అనంతపురంలోని సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఆయన సమీక్షించారు. అనంతపురం సర్కిల్ కార్యాలయ సూపరింటెండెంట్ ప్రభాకర్‌రెడ్డి, పీఏ రాజేంద్ర ప్రసాద్, పీఐయూ ఈఈ నవీన్‌కుమార్, ఈఈలు శంకరయ్య, రఘునాథరెడ్డి, డీఈఈలు, ఏఈఈలు హాజరయ్యారు. నాలుగేళ్లలో అనంతపురం జిల్లాకు సంబంధించి రూ.209 కోట్లతో 138 రోడ్లు మంజూరు కాగా, ఇప్పటి వరకు 52 పనులు పూర్తయ్యాయని, 42 పనులు ప్రోగ్రెస్‌లో ఉండగా, 44 పనులు రద్దయినట్లు ఇంజినీరింగ్ అధికారులు వివరించారు. మొత్తం రూ.101 కోట్లు ఖర్చు పెట్టి 195.71 కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించినట్లు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లాకు రూ.230 కోట్లతో 194 పనులు మంజూరు కాగా, 119 పనులు పూర్తయినట్లు ఇంజినీర్లు వివరించారు. 28 పనులు వివిధ దశల్లో ఉండగా, 47 పనులు రద్దయ్యాయని తెలిపారు. మొత్తం 193.91 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించినట్లు పేర్కొన్నారు. అలాగే కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పరిస్థితిపైనా ఆయన సమీక్షించారు. గడువులోపు పనులన్నీ పూర్తి నాణ్యతగా చేయాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.