
‘పరిష్కార వేదిక’కు 58 వినతులు
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 58 వినతులు అందాయి. ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ హేమంత్‌కుమార్ వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ సాయినాథరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసినా
కేసు నమోదు చేయలేదు..
తన పొలంలో ఏర్పాటు చేసుకున్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి, రాగి వైర్ అపహరించారని, ఈ విషయంగా పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకూ కేసు నమోదు చేయలేదంటూ డీఎస్పీ హేమంత్‌కుమార్ ఎదుట గోరంట్లకు చెందిన రైతు మురళి వాపోయాడు. జూన్ 29 రాత్రి ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేశారని తెలిపారు. అదే నెల 30న గోరంట్ల పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వివరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కేసు నమోదు చేయలేదని, ఇదేమని అడిగితే ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసం చేసిన దుండగులు దొరికితే కేసు నమోదు చేస్తామని సీఐ రాజశేఖర్ అంటున్నారని వాపోయాడు. ఎఫ్‌ఐఆర్ నకలు ఇస్తే కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను విద్యుత్ శాఖ అధికారులు కేటాయిస్తామంటున్నారని, లేకుంటే రూ.80 వేలు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎఫ్‌ఐఆర్ కాఫీ ఇప్పించి, తన సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకున్నాడు.