
డివైడర్‌ను ఢీకొని వ్యక్తి మృతి
పరిగి: స్థానిక జాతీయ రహదారిపై ఉన్న డివైడర్‌ను ఢీకొని ఓ ద్విచక్ర వాహన చోదకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... లేపాక్షి మండలం వడ్డిపల్లికి చెందిన చిన్నకొండప్ప గారి గంగాధరప్ప (41) బేల్దారి పనులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం తన భార్య సునందమ్మతో కలసి కర్ణాటకలోని పావగడ తాలూకా అచ్చంపల్లికి ద్విచక్రవాహనంపై వెళ్లాడు. అక్కడ భార్యను పుట్టింట్లో వదిలి అదే రోజు రాత్రి స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. పరిగి మండలం ధనాపురం క్రాస్ సమీపంలో ప్రయాణిస్తుండగా రాత్రి 9 గంటల సమయంలో నియంత్రణ కోల్పోయి జాతీయ రహదారిపై ఉన్న డివైడర్‌ను ఢీకొన్నాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన గంగాధరప్పను అటుగా వెళుతున్న వారు గుర్తించి వెంటనే హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బంధువులు బెంగళూరుకు తీసుకెళుతుండగా సోమవారం వేకువజామున మార్గ మధ్యంలో మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.