
ఉద్యానం వైపు.. రైతు చూపు
పుట్టపర్తి అర్బన్: సంప్రదాయ పంటల్లో నష్టాలు వస్తుండటంతో రైతులు బహుళ పంటల వైపు దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. క్రమంగా వీటి సాగు విస్తీర్ణం కూడా పెరుగుతోంది. సాధారణంగా ఖరీఫ్ సీజన్‌లో వేరుశనగ, కంది, మొక్కజొన్న, సజ్జ పంటలు సాగయ్యేవి. ఏటా నష్టాలు వస్తుండడంతో ఇబ్బంది పడుతున్న రైతులు ఆలోచన మార్చుకున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించలేకున్నా ప్రైవేటు మార్కెట్‌లపై ఆధార పడి పలు రకాల కూరగాయలు, పూల తోటలు సాగు చేస్తున్నారు. ఏటా ఉద్యాన శాఖ సహకారంతో జిల్లాలో సుమారు 64 వేల హెక్టార్లలో పంటలు సాగు చేస్తారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 64,359 హెక్టార్లలో పండ్ల తోటలు, కూరగాయలు, పూలు, మసాలా దినుసులు వంటి పలు రకాల తోటలను సాగు చేశారు.
16,137 హెక్టార్లలో కూరగాయలు
జిల్లాలో చీనీ, మామిడి, బొప్పాయి, అరటి, జామ, దానిమ్మ, సపోట, ద్రాక్ష, కళింగర, దోస పంటలు దాదాపు 42,679 హెక్టార్లలో సాగవుతున్నాయి. ఇక ఉల్లి, టమాట, ఆలూ, బెండ, వంకాయ, దోస, బీన్స్ తదితర రకాల కూరగాయల పంటలు 16,137 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. మసాలా దినుసులు ఎండు మిర్చి, చింతపండు, పసుపు, ధనియాలు, కొత్తిమీర, తమలపాకు తోటలు 3,702 హెక్టార్లు, పూల మొక్కలైన రోజా, జాస్మిన్, బంతి పూలు, కనకాంబరాలు, చామంతి తదితర రకాలను 619 హెక్టార్లలో సాగు చేశారు. గత ప్రభుత్వంలో ఉచితంగా బోర్లు వేయించడంతో రైతులు సద్వినియోగం చేసుకొని ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచారు. బోర్లలో నీళ్లు సమృద్ధిగా ఉండడంతో దీర్ఘకాలిక పంటలతో పాటు సీజనల్‌గా కూరగాయలు, ఆకు కూరలు పంటలు సాగు చేస్తూ లబ్ధి పొందుతున్నారు. జిల్లా వాసులకు బెంగళూరు, మదనపల్లి, బాగేపల్లి, డీక్రాస్, హిందూపురం, అనంతపురం తదితర మార్కెట్లలో పంట ఉత్పత్తులను విక్రయిస్తున్నారు.
సంప్రదాయ పంటల్లో తరచూ నష్టాలు
పంట మార్పిడి కోసం రైతుల ఆసక్తి
కూరగాయలు, పండ్లు, పూల తోటల సాగుకు మొగ్గు

ఉద్యానం వైపు.. రైతు చూపు

ఉద్యానం వైపు.. రైతు చూపు