
ఏడీఏగా అల్తాఫ్ అలీఖాన్
అనంతపురం అగ్రికల్చర్: అత్యంత కీలకమైన వ్యవసాయశాఖ అనంతపురం డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా జీఎం అల్తాఫ్ అలీఖాన్ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం కమిషనరేట్ నుంచి బదిలీ ఉత్తర్వులు వెల్లడయ్యాయి. ఈ స్థానం కోసం పోటీలో ఉన్న జి.క్రిష్ణయ్యను హిందూపురం ఏడీఏగా బదిలీ చేశారు. అల్తాఫ్ అలీఖాన్ ప్రస్తుతం హిందూపురం ఏడీఏగా ఉన్నారు. ఇప్పటి వరకు అనంతపురం ఏడీఏగా ఉన్న జి.రవిని తాడిపత్రికి బదిలీ చేసిన విషయం తెలిసిందే. బదిలీ సమయంలో ధర్మవరంలో పనిచేస్తున్న క్రిష్ణయ్య తాడిపత్రి కావాలని దరఖాస్తు చేసుకున్నారు. అనంతపురం స్థానం కోసం ఆయన కోరుకోకున్నా... బది‘లీల’ల్లో భాగంగా పోటీలోకి తెచ్చారు. కాగా సాధారణ బదిలీల్లో భాగంగా గత నెల 9న విడుదల చేసిన మొదటి జాబితాలోనే ఈ ఇరువురు అధికారులకు ఇవే స్థానాలు కేటాయించారు. అయితే అదే రోజు ఉన్నఫళంగా వెనక్కు తీసుకున్నారు. అప్పటి నుంచి నాటకీయ పరిణామాలు, పైరవీలు, సిఫారసులు, రాజకీయ జోక్యం అధికం కావడంతో దాదాపు 40 రోజుల పాటు ఎటూ తేల్చకుండా ఉంచారు. అనంతపురం ఏడీఏ స్థానం అంశం సీఎం, మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడుతో పాటు ఉన్నతస్థాయి అధికారుల వరకు మరోసారి వెళ్లినట్లు చెబుతున్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, కొందరు డీలర్లు అల్తాఫ్ కావాలని, కమిషనరేట్ అధికారులు, అసోసియేషన్ నాయకులు క్రిష్ణయ్య కావాలంటూ పట్టుపట్టినట్లుగా చెబుతున్నారు. ఇలా వ్యవసాయశాఖ పరిధిలో అనంతపురం ఏడీఏ స్థానం కీలకం కావడంతో క్రిష్ణయ్య అంటూ ఉదయం, అల్తాఫ్ అంటూ సాయంత్రం ఇలా రోజూ ఇరువురు అధికారుల పేర్లు చక్కర్లు కొడుతూ వచ్చాయి. ఎట్టకేలకు అల్తాఫ్ అలీఖాన్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించి ఉత్కంఠకు తెరదించారు. ఉత్తర్వులు వెలువడిన గంటల వ్యవధిలోనే అల్తాఫ్ అలీఖాన్ సత్యసాయి జిల్లాలో రిలీవ్ అయ్యి అనంతపురం జేడీఏ ఉమామహేశ్వరమ్మను కలిసి జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు.
40 రోజుల తర్వాత వెల్లడైన బదిలీ జాబితా
ఉత్తర్వులు వచ్చిన గంటల వ్యవధిలోనే జాయినింగ్