
సీమకు తీరని అన్యాయం
అనంతపురం కార్పొరేషన్: రాయలసీమకు చంద్రబాబు తీరని అన్యాయం చేశారని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు గాజుల ఉమాపతి ధ్వజమెత్తారు. శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కర్నూలులో లా యూనివర్సిటీ, హెచ్‌ఆర్‌సీ, హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటే.. కూటమి ప్రభుత్వం వాటిని అమరావతికి తరలించి రాయలసీమకు తీరని అన్యాయం చేశారన్నారు. లోకాయుక్తను తరలించేందుకు సీఎం చంద్రబాబు కుట్ర చేస్తున్నారన్నారు. హంద్రీ–నీవాను ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది చంద్రబాబేనన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కారణంగానే హంద్రీ–నీవా నీరు వస్తోందన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌని నాగన్న, ఆర్‌టీఐ విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, న్యాయవాదులు రాజశేఖర్ యాదవ్, బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్ర విభజనలో భాగంగా అనంతపురం జిల్లాకు ఎయిమ్స్ మంజూరైతే.. దాన్ని అమరావతికి తరలించిన దుర్మార్గుడు చంద్రబాబు అని మండిపడ్డారు. ఎయిమ్స్ ఏర్పాటై ఉంటే జిల్లాలో వైద్య సేవల్లో నాణ్యత పెరగడమే కాకుండా వందలాది మందికి ఉపాధి లభించేదన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, న్యాయవాదులు మురళీధర్, రమణారెడ్డి, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు ఉమాపతి ధ్వజం