
గుండెపోటుతో కాలువలో పడి వ్యక్తి మృతి
ధర్మవరం అర్బన్: పట్టణంలోని లోనికోటకు చెందిన పటాన్ షామీర్‌బాషా (55) శనివారం ఉదయం మార్కెట్ వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా గుండెపోటు రావడంతో పక్కనే ఉన్న మురుగుకాలువలోకి పడి మృతి చెందాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు ఆరా తీశారు. అనంతరం తమ్ముడు మహమ్మద్‌బాషా, కుటుంబ సభ్యులు వచ్చి షామీర్‌బాషా మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. షామీర్ బాషా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, ఈ క్రమంలోనే గుండెపోటు వచ్చి ఉంటుందని వారు తెలిపారు.
పాడి ఆవుల అపహరణ
కొత్తచెరువు: మండల కేంద్రంలో నాలుగు పాడి ఆవులు అపహరణకు గురయ్యాయి. నామగుండ్ల వీధికి చెందిన నంబి క్రిష్ణమూర్తి వ్యవసాయంతో పాటు పాడి పెంపకంతో జీవనం సాగిస్తున్నాడు. కొత్తచెరువు సమీపంలోని శిలేబడ్డు వద్దనున్న పొలంలోని షెడ్డులో కట్టేసిన నాలుగు పాడి ఆవులను ఈ నెల 12వ తేదీ రాత్రి దుండగులు అపహరించుకుపోయారు. మరుసటిరోజు ఉదయం ఆవులు కనిపించకపోవడంతో నంబిక్రిష్ణమూర్తి చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలించారు. అయినా ఎక్కడా ఆచూకీ లభించలేదు. రూ.1.05లక్షలు విలువ చేసే నాలుగు పాడి ఆవులు అపహరణకు గురయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.