
వైఎస్సార్ సీపీ నుంచి పలువురి సస్పెండ్
చిలమత్తూరు: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న పలువురిని వైఎస్సార్ సీపీ నుంచి ఆ పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం రాత్రి పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. సస్పెండ్ అయిన వారిలో హిందూపురం 17వ వార్డు కౌన్సిలర్ వై. మాజీన్, 31వ వార్డు కౌన్సిలర్ పీసీ చిన్నమ్మ, టౌన్ బ్లాక్ కన్వీనర్ సీఎన్‌పీ నాగరాజు, హిందూపురం మున్సిపాలిటీకి చెందిన హబీబ్ ఉన్నారు. వీరిపై పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో విచారణ జరిపి క్రమశిక్షణా కమిటీ సిఫార్సు మేరకు సస్పెండ్ చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం
● ప్రభుత్వాన్ని హెచ్చరించిన
పెన్షనర్ల సంఘం
● కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం
ప్రశాంతి నిలయం: తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మంగళవారం ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో గోకులం నుంచి కలెక్టరేట్ వరకు పెన్షనర్లు ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు రామకృష్టయ్య, ప్రధాన కార్యదర్శి నాగార్జున శెట్టి మాట్లాడుతూ, పెన్షనర్ల అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. పెన్షనర్లకు నష్టం కలిగించే కేంద్ర ప్రభుత్వ ఫైనాన్స్ బిల్‌తో పాటు పెన్షన్ వ్యాలిడేషన్ అమిడ్‌మెంట్ బిల్లును రద్దు చేయాలన్నారు. కేంద్రం 8వ పే కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం 12వ పే కమిషన్‌ను వెంటనే నియమించాలని, పెండింగ్‌లో ఉన్న డీఆర్ బకాయిలు తక్షణం చెల్లించాలన్నారు. ఆస్పత్రుల్లో హెల్త్ కార్డుపై నగదు రహిత సేవలు అందేలా చూడాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్‌ఓకు అందజేశారు. కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆత్మారెడ్డి, జేఏసీ చైర్మన్ లింగా రామ్మోహన్, పెనుకొండ, హిందూపురం, మడకశిర, కదిరి, ధర్మవరం యూనియన్ కార్యవర్గ సభ్యులు, జిల్లా నలుమూల నుంచి తరలివచ్చిన పెన్షనర్లు పాల్గొన్నారు.

వైఎస్సార్ సీపీ నుంచి పలువురి సస్పెండ్