
పుట్టపర్తిలో ఇసుక తోడేళ్లు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాగానే టీడీపీ నాయకులు సహజ వనరులపై కన్నేశారు. ముఖ్యంగా బాగా డిమాండ్ ఉన్న ఇసుకనే ఆదాయ వనరుగా మార్చుకున్నారు. అధికారం అడ్డు పెట్టుకుని.. అధికారులను మామూళ్ల మత్తులో జోకొట్టి.. నదుల నుంచి యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేస్తున్నారు. జిల్లా కేంద్రం పుట్టపర్తి సమీపంలోని చిత్రావతి నది నుంచి పట్టపగలే ట్రాక్టర్ల ద్వారా భారీగా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
ఇసుక రవాణాకు ప్రత్యేక వ్యవస్థ
కూటమి నేతలు కొందరు సిండికేటుగా మారి చిత్రావతి నదిలో ఇసుక అమ్మకాలకు శ్రీకారం చుట్టారు. ఇసుకను అక్రమంగా తరలించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు. చిత్రావతి నదిలోకి ట్రాక్టర్లు వెళ్లేందుకు పుట్టపర్తి దుర్గమ్మ గుడి పక్క నుంచి రోడ్డు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి హారతి ఘాట్ మీదుగా కర్ణాటక నాగేపల్లి బ్రిడ్జి వరకు ఇసుక ట్రాక్టరుకు ముందుగా రెండు బైకులు వెళ్తుంటాయి. ఏదైనా ఇబ్బందులుంటే బైక్‌పై ఉన్న వ్యక్తులు ముందే సమాచారం ఇస్తారు. అలాగే ఇసుక ట్రాక్టర్ వెనుక కూడా రెండు బైకులు వస్తుంటాయి. వెనుక నుంచి ఎవరు వచ్చినా బైక్‌లపై ఉన్న వారు చూసుకుంటారు. ఇలా కర్ణాటక నాగేపల్లి బ్రిడ్జి వరకూ ఇసుక ట్రాక్టర్లకు రక్షణగా వెళ్తారు. ఇలా ఇసుక ట్రాక్టర్‌కు రక్షణగా వెళ్లినందుకు ఒక్కో ట్రాక్టర్ నుంచి రూ.500 వసూలు చేస్తున్నట్లు తెలిసింది. డబ్బులు ఇవ్వని ట్రాక్టర్ల సమాచారం పోలీసులకు ఇచ్చి పట్టిస్తారు. ఎనుములపల్లి శివారు నుంచి ఒక సమూహం.. దుర్గమ్మ గుడి దగ్గర నుంచి మరో గ్రూపు.. ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుక తరలిస్తూ భారీగా వెనుకేసుకుంటున్నారు.
కావాలంటే రూ.1,000 తీసుకో..
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఎవరైనా అధికారి వెళితే...ఆయనకూ మామూళ్ల ఎర వేస్తారు. వినకపోతే వారి ఉన్నతాధికారుల పేర్లు చెప్పి భయపెడతారు. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం చిత్రావతి నదిలో ఇసుకను ట్రాక్టర్లకు నింపుతుండగా.. ఇరిగేషన్ అధికారి ఒకరు అక్కడికి వెళ్లి అడ్డుకున్నారు. అయితే ‘మీ పై అధికారులకు లంచం ఇచ్చాం. ఈ రోజంతా తరలిస్తూనే ఉంటాం. నీకూ కావాలంటే రూ.వెయ్యి ఇస్తాం. ఈ రోజంతా ఇటు వైపు చూడొద్దు. కాదు.. కూడదు అంటే ఇష్టం వచ్చింది చేస్కో. ఎమ్మెల్యే దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాం. మా ప్రభుత్వంలో మమ్మల్ని ఎవరు అడ్డుకునేది’ అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో సదరు అధికారి మారుమాట్లాడకుండా అక్కడి నుంచి వెనక్కు వచ్చారు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కాకపోతే పోలీసులు వచ్చే లోపు ఇసుకాసురులు అక్కడి నుంచి పరారయ్యారు. ఇలా వారు తప్పించుకుని వెళ్లేందుకు కూడా కొందరు సహకరించినట్లు తెలుస్తోంది.
చిత్రావతి నదిని తోడేస్తున్న
‘తమ్ముళ్లు’
పగలు, రాత్రి తేడా లేకుండా
యథేచ్ఛగా ఇసుక దోపిడీ
ప్రశ్నించిన ఓ ఇరిగేషన్ అధికారికి బెదిరింపులు
ఉన్నతాధికారులకు భారీగా
సమర్పించుకున్నామని వెల్లడి

పుట్టపర్తిలో ఇసుక తోడేళ్లు