
రాజకీయ క్రీనీడలో భూసేకరణ సమావేశం
చిలమత్తూరు: మండలంలోని టేకులోడు గ్రామంలో సెజ్ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియపై గురువారం ఏర్పాటు చేసిన సమావేశాన్ని టీడీపీ నేతలు దబడి దిబిడిగా మార్చేశారు. ఆర్డీఓ వస్తున్నారని రైతులంతా రావాలని హాజరు కావాలని ముందస్తుగా అధికారులు ప్రకటించారు. అయితే గురువారం ఉదయం సమావేశానికి స్థానిక తహసీల్దార్ తప్ప మరే అధికారి హాజరు కాలేదు. మొత్తం సమావేశాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలు శ్రీనివాసరావు, సురేంద్రబాబు దగ్గరుండి నడిపించారు. వేదికపై తహసీల్దార్ ఒక్కరే అధికారి కాగా, మిగిలిన వారందరూ టీడీపీ నాయకులు ఆక్రమించేశారు. రైతులకు అనుకూలంగా మాట్లాడాల్సిన నాయకులు బెదిరింపు ధోరణితో రైతుల గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. పక్క నియోజకవర్గాల్లో భూములు తక్కువ ధరకే వస్తున్నాయని, ఇక్కడ రైతులు కూడా ప్రభుత్వం అందించే స్వల్పపాటి పరిహారం తీసుకొని భూములు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. పారదర్శకంగా నిర్వహించాల్సిన గ్రామ సభ కాస్త పక్కదారి పట్టడంతో రైతుల్లో అసహనం వ్యక్తమైంది. తక్కువ ధరకే దౌర్జన్యంగా భూములు కొట్టేయాలని చూస్తున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సెజ్ ఏర్పాటుకు భూములు ఇచ్చే రైతులకు ఎకరాకు రూ.25 లక్షలు పరిహారం చెల్లించేలా అప్పటి సీఎం వైఎస్ జగన్ చొరవ తీసుకున్నారని, ప్రస్తుతం రూ.12 లక్షలకే భూములు అప్పగించాలంటూ ఒత్తిడి చేయడం సబబు కాదని పలువురు రైతులు వాపోయారు. కాగా, సెజ్ ఏర్పాటుకు భూములు సేకరిస్తే నిర్వాసితులకు ఆయా పరిశ్రమల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సమావేశంలో తహసీల్దార్ నటరాజ్‌కు సీపీఎం నేత ప్రవీణ్‌కుమార్ వినతి పత్రం అందజేసి, మాట్లాడారు.
తహసీల్దార్ తప్ప వేదికపై కూర్చున్న వాళ్లందరూ టీడీపీ నేతలే
గ్రామ సభలో రైతుల గొంతు నొక్కే ప్రయత్నం