
‘స్మార్ట్‌మీటర్ల’పై క్యూఆర్ కోడ్‌తో పోరాటం : సీపీఎం
అనంతపురం అర్బన్: స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుపై ప్రజా నిరసన ప్రభుత్వానికి తెలియజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.రాంభూపాల్ తెలిపారు. ప్రజలతో క్యూర్‌కోడ్ స్కాన్ చేయించి తమ వ్యతిరేకతను నేరుగా సీఎం కార్యాలయానికి తెలియజేసేలా చర్యలు తీసుకున్నారు. బుధవారం స్థానిక గణేనాయక్ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప, కార్యవర్గ సభ్యులతో కలిసి క్యూఆర్ కోడ్ ప్రతులను ఆయన విడుదల చేసి, మాట్లాడారు. ఈ నెల 6న ప్రజా సముదాయం ఉండే కూడళ్లలో ప్రజల ద్వారానే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయిస్తామన్నారు. ఈ విధానానికి స్వస్తి పలికేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో భాగంగా చేపట్టిన క్యూఆర్ కోడ్ పోరులో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బాలరంగయ్య, నాగేంద్రకుమార్, కృష్ణమూర్తి, చంద్రశేఖరరెడ్డి, రామిరెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు.