
కరెంట్.. కటకట
● పుట్టపర్తిలోని గోవిందపేటకు చెందిన ఓ చిన్న కుటుంబం కేవలం కరెంటు పొయ్యి మీద ఆధారపడి వంట చేస్తోంది. అయితే ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కరెంటు లేకపోవడంతో బయటి హోటల్ నుంచి ఆహారం తెచ్చుకుని తిన్నట్లు ఆ నవదంపతులు తెలిపారు. కరెంటు కోతల కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నట్లు పేర్కొన్నారు.
● పుట్టపర్తి మున్సిపాలిటీ ఎనుములపల్లిలో ఓ యువకుడు ఇంటి నుంచి ఉద్యోగం (వర్క్ ఫ్రం హోం) చేస్తున్నాడు. విదేశీ కంపెనీ కావడంతో ఆదివారం కూడా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. కానీ.. ఎలాంటి సమాచారం లేకుండా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కరెంటు కోత విధిస్తుండటంతో ఉద్యోగం చేయలేక ఇబ్బంది పడినట్లు పేర్కొన్నాడు. ముందస్తు సమాచారం ఉంటే.. ఇతర ప్రాంతాలకు వెళ్లి లాగిన్ అయ్యే పరిస్థితి ఉండేదని వివరించాడు.
● పుట్టపర్తిలోని గోకులంలో ఓ చిల్లర దుకాణంలో ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన పదార్థాలన్నీ దెబ్బ తిన్నాయి. ఉదయం నుంచి కరెంటు కోతలు ఉండటంతో ఐస్ క్రీమ్‌లు, చాక్లెట్లు కరిగిపోయినట్లు తెలిపాడు. మధ్యాహ్నం తర్వాత విద్యుత్ వచ్చినప్పటికీ అప్పటికే నష్టం జరిగినట్లు చెప్పాడు. సుమారు రూ.5 వేల నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నాడు. మిగతా సరుకులు కూడా కూలింగ్ లేక సేల్ కాలేదని వాపోయాడు.
ముందస్తు సమాచారం లేదు
కరెంటు కోతలు విధించే పరిస్థితి ఉన్నప్పుడు.. ముందస్తు సమాచారం ఇస్తే.. ప్రత్యామ్నాయ మార్గం వెతుక్కుంటాం. ఉన్నపళంగా విద్యుత్ కోతలతో ఇంట్లో పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోతాయి. సెలవు దినం కావడంతో ముందుగా ప్లాన్ చేసుకున్న పనులన్నింటినీ కరెంటు కోతల కారణంగా పక్కన పెట్టాల్సి వస్తోంది.
– రామాంజినమ్మ, బడేనాయక్ తండా, పుట్టపర్తి
ఎడాపెడా కరెంటు కోతలు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యుత్ కోతలు ఇష్టారాజ్యంగా విధిస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా కరెంట్ కట్ చేస్తున్నారు. ఫలితంగా పుట్టపర్తిలో అన్ని రంగాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలుస్తోంది.
– సి.గంగాదేవి, సాయినగర్, పుట్టపర్తి
సాక్షి, పుట్టపర్తి: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో అనధికారిక కరెంటు కోతలు ఎక్కువయ్యాయి. ప్రతి శని, ఆదివారాల్లో అయితే ఎడాపెడా కరెంటు తీసేస్తుండటంతో మహిళలు, ఉద్యోగులు, వ్యాపారులు తదితర అన్ని రంగాల వారు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 20 వార్డుల్లోనూ సమస్య తలెత్తుతోందని వాపోతున్నారు. ఏ ఒక్క ప్రాంతంలో కూడా విద్యుత్ సరఫరా లేకపోవడంతో అవస్థలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంట చేసుకునేందుకు ఇబ్బందిగా ఉందని మహిళలు చెబుతున్నారు. ఇంటి నుంచి ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులకు తిప్పలు తప్పడం లేదు. వ్యాపారులకు పలు రకాలుగా నష్టం వాటిల్లుతోంది. కరెంటు కోతలతో కూలింగ్ కావాల్సిన సరుకులు పనికి రాకుండా పోతున్నాయి.
ఉదయం నుంచి వెతలే
ఓ వైపు వాతావరణ మార్పులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నపళంగా వర్షం రావడం.. ఆ తర్వాత ఎండ కాయడం.. మరి కాసేపటికే చీకటి అవుతోంది. ఇంకో వైపు కరెంటు కోతలు ముప్పుతిప్పలు పడుతున్నాయి. విద్యుత్‌తో నడిచే పరికరాలతో వంట చేయడం అలవాటుగా మార్చుకున్న సమాజంలో కరెంటు కోతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
పుట్టపర్తిలో రాత్రింబవళ్లు అవస్థలు
శని, ఆదివారాల్లో సమాచారం లేకుండా కోతలు
ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు,
గృహిణులు
ఉదయం వంట చేయలేక మహిళల ఇబ్బందులు
వర్క్ ఫ్రమ్ హోమ్ విధులకూ తప్పని తిప్పలు
మరమ్మతుల వల్లే అంతరాయం
అకాల వర్షాలతో పుట్టపర్తిలో కొన్ని చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. విద్యుత్ స్తంభాలు మరమ్మతులకు గురయ్యాయి. అక్కడక్కడా పనుల నిమిత్తం మాత్రమే కోతలు విధించాం. వర్షం కారణంగా ఉన్నపళంగా మరమ్మతులు చేయాల్సి ఉండటంతో కోతలు విధిస్తున్నట్లు ఒక రోజు ముందుగానే చెప్పలేకపోతున్నాం.
– సాయినాథ్, విద్యుత్ ఏఈ, పుట్టపర్తి

కరెంట్.. కటకట

కరెంట్.. కటకట