సైబర్ నేరగాళ్ల అరెస్ట్
కదిరి అర్బన్: సైబర్ నేరాలకు పాల్పడిన ముఠా సభ్యులను కదిరి రూరల్ అప్‌గ్రేడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను సీఐ నిరంజనరెడ్డి వెల్లడించారు. పుట్టపర్తికి చెందిన టి.శ్రీనివాసరావు, టి.దుర్గాబాయి దంపతులు గతంలో కర్నూలులో వాటర్ ఫిల్టర్ పరికరాల వ్యాపారం చేసేవారు. అందులో నష్టాలు చవిచూశాక 2023లో పుట్టపర్తికి మకాం మార్చారు. పుట్టపర్తిలోని కోటక్ మహేంద్ర బ్యాంక్‌లో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న సాయిభార్గవి, ధర్మవరంలో సిమ్‌కార్డులు అమ్ముకుని జీవనం సాగిస్తున్న శివానందతో పరిచయం పెంచుకున్నారు. సాయిభార్గవి ద్వారా కోటక్ మహేంద్ర బ్యాంక్‌లో ఖాతాలు తెరుస్తూ శివానంద్ వద్ద నుంచి పొందిన సిమ్‌కార్డులతో ఆర్వో ప్లాంట్ల యజమానులను సంప్రదించేవారు. ప్లాంట్‌కు సంబంధించిన పరికరాలు సగం ధరకే ఇస్తామని నమ్మబలికి తమ బ్యాంక్ ఖాతాకు డబ్బులు బదలాయించుకుని ఆ తర్వాత సిమ్ కార్డులు, బ్యాంక్ ఖాతాలను మార్చేవారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది వీరి ఖాతాలకు నగదు బదలాయించి మోసపోయారు. ఈ క్రమంలో కదిరి మండలం బోడేనాయక్‌తండాకు చెందిన బాబ్జీనాయక్ గత ఏడాది జులై 16న తాగునీటికి ఉపయోగించే రూ.15 వేల విలువైన ఏటీఏం కాయిన్ బాక్స్ కోసం రూ.8 వేలను ఫోన్‌పే చేసి మోసపోయాడు. దీనిపై బాబ్జీనాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో బుధవారం కదిరి కొండ వద్ద తచ్చాడుతున్న శ్రీనివాసరావు దంపతులను గుర్తించి అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.4 లక్షల నగదు, 8 మొబైల్ ఫోన్లు, 13 డెబిట్ కార్డులు, 52 సిమ్‌కార్డులు, 2 చెక్‌బుక్కులు, 8 బ్యాంక్ పాసుపుస్తకాలు, 2 పాన్‌కార్డులు, 6 బిల్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు.
రూ.4 లక్షల నగదు స్వాధీనం


