ఐదేళ్లలో వందేళ్ల అభివృద్ధి
వైఎస్ జగన్ సుపరిపాలనకు
నిదర్శనంగా జగరాజుపల్లి
ఒక్క గ్రామంలోనే రూ.21 కోట్లకుపైగా అభివృద్ధి పనులు
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో
మారిన పల్లె రూపురేఖలు
జగన్ సర్కార్ మేలు మరచిపోలేమంటున్న గ్రామస్తులు
పుట్టపర్తి అర్బన్: మండలంలో జగరాజుపల్లి గ్రామస్తులు గతంలో సమస్యలతో సహజీవనం చేసేవారు. గ్రామంలో ఎప్పుడు సభ నిర్వహించినా అధికారుల నిర్భంధం, రాస్తారోకోలు, ధర్నాలు జరిగేవి. ప్రజాప్రతినిధులు ఆ గ్రామానికి వెళ్లేందుకు సాహసించే వారు కాదు. కానీ రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కొలువుదీరాక జగరాజుపల్లి రూపురేఖలు మారిపోయాయి.
రహదారి నిర్మాణంతో మొదలు..
ఏ గ్రామానికై నా రహదారి ఉంటే అభివృద్ధికి మార్గం ఏర్పడుతుంది. కానీ జగరాజుపల్లికి ఏళ్లుగా సరైన రోడ్డు లేదు. ధర్మవరం–గోరంట్ల ప్రధాన రహదారి నుంచి రెండు కిలోమీటర్లు గ్రామంలోకి వెళ్లే రహదారి సరిగా లేక గ్రామస్తులు నరకం చూసేవారు. కానీ 2019 ఎన్నికల సమయంలో దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి గ్రామానికి రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో జగన్ సర్కార్ కొలువు దీరగానే రూ.3.5 కోట్లతో లింకు రోడ్డు వేయించారు.
ప్రతి వీధిలోనూ అభివృద్ధి..
వైఎస్ జగన్ తొలి విడతలోనే జగరాజుపల్లిలో సచివాలయం, రైతు భరోసా కేంద్రాన్ని నిర్మించారు. 27 మంది నిరుపేదలకు జగనన్న కాలనీలో ఇంటి పట్టాలు మంజూరు చేసి ఇళ్లను కూడా నిర్మించారు. సొంత స్థలమున్న వారికి 56 ఇళ్లు మంజూరు చేశారు. రూ.1.5 కోట్లతో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలతో పాటు కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో మరమ్మతులు చేయించారు. పాఠశాలలో ఫర్నీచర్ మొదలు ఆర్‌ఓ ప్లాంటు దాకా సౌకర్యాలు కల్పించారు. మోడల్ స్కూల్ ప్రహరీతో పాటు కేజీబీవీలో 8 గదులతో అధునాతన భవనానికి శ్రీకారం చుట్టారు. ఇక రూ.35 లక్షలతో ప్రతి వీధికీ సిమెంటు రోడ్లు వేశారు. జల్ జీవన్ మిషన్ కింద రూ.4.5 లక్షలతో తాగునీటి పైప్ లైను, ఇంటింటికీ కొళాయి సౌకర్యం కల్పించారు. అలాగే రూ. 2 కోట్లతో 5 ఎంవీఏ కెపాసిటీతో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మించారు.
పుట్టపర్తి మండల జగరాజుపల్లిలో 547 కుటుంబాలు 1,472 మంది జనాభా ఉన్నారు. గతంలో కనీస సౌకర్యాలకు నోచుకోని ఈ గ్రామం ఇప్పుడు అభివృద్ధికి చిరునామాగా మారింది. రూ.3.5 కోట్లతో తళతళ మెరిసే తారు రోడ్డు. ఊర్లో మిలమిల మెరిసే సిమెంట్‌రోడ్లు. కార్పొరేట్ స్కూళ్లను తలపించే పాఠశాలలు..ఇలా ఒకటేమిటి ఎటు చూసినా అభివృద్ధే కనిపిస్తుంది. ఎవరిని కదిపినా సంక్షేమ సంగతుల ప్రవాహం కొనసాగుతుంది.
ఐదేళ్లలో వందేళ్ల అభివృద్ధి
ఐదేళ్లలో వందేళ్ల అభివృద్ధి


