మొండిగా ముందుకు.. | - | Sakshi
Sakshi News home page

మొండిగా ముందుకు..

Jun 11 2025 7:51 AM | Updated on Jun 11 2025 7:51 AM

మొండిగా ముందుకు..

మొండిగా ముందుకు..

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఉపాధ్యాయుల్లో అత్యధికులైన సెకండరీ గ్రేడ్‌ టీచర్ల బదిలీల్లో విద్యాశాఖ అధికారులు సీనియార్టీ జాబితాలో అసంబద్ధాలు తొలగించకుండానే మొండిగా ముందుకు వెళ్లాలని చూశారు. అయితే, ఫిర్యాదులను పట్టించుకోకుండా కౌన్సెలింగ్‌కు సిద్ధమవడంతో ఉపాధ్యాయ సంఘాల నాయకులు అడ్డుకోవడంతో గందరగోళం నెలకొంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక పంగల్‌రోడ్డులోని ఆర్డీటీ స్కూల్‌లో సీరియల్‌ నంబరు 1 నుంచి 350 వరకు ఉన్న టీచర్లకు బదిలీలు చేపడతామని విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. దీంతో ఉమ్మడి జిల్లా నలుమూల నుంచి ఉరుకులు, పరుగులతో ఎస్జీటీలు కౌన్సెలింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు.

తీవ్ర ఇబ్బందులు..

కౌన్సెలింగ్‌ కేంద్రంలో తాగేందుకు కూడా నీటి వసతి కల్పించకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో సాంకేతిక కారణాలు అంటూ, ఉన్నతాధికారుల నుంచి లింక్‌ రాలేదంటూ రాత్రి 9 గంటల దాకా గడిపారు. ఎట్టకేలకు 9.30 గంటల సమయంలో కౌన్సెలింగ్‌ ప్రారంభిస్తున్నట్లు డీఈఓ ప్రసాద్‌బాబు మైకుద్వారా ప్రకటించారు. ముందుగా జాబితాలోని 1 నుంచి 30 మంది టీచర్లు రావాలని పిలవగా.. ఉపాధ్యాయ సంఘాల నాయకులు అడ్డుకున్నారు. అనేక ఫిర్యాదులు ఇచ్చినా అవేవీ పట్టించుకోకుండా సీనియార్టీ జాబితాలో మార్పు చేయకుండా ఎలా నిర్వహిస్తారంటూ నిలదీశారు. ఒక టీచరుకు 32 పాయింట్లు రావాల్సి ఉండగా 27 పాయింట్లు వచ్చాయని, రెండుసార్లు రీఅపోర్స్‌మెంట్‌కు గురైన మరో టీచరుకు రావాల్సిన 7 ప్రత్యేక పాయింట్లు వేయలేదని, తాత్కాలిక సీనియార్టీ జాబితాలో ఉన్న స్పౌజ్‌ పాయింట్లు ఫైనల్‌ జాబితాలో కనిపించడం లేదని.. ఇలా పదుల సంఖ్యల్లో సమస్యలు ఉన్నాయన్నారు. దీంతో సీనియార్టీలో వందలు, వేలల్లో తేడా వస్తోందంటూ వాపోయారు. ఇవేవీ పరిష్కరించకుండా వారిని అన్యాయం చేస్తారా అని నిలదీశారు. కమిషనర్‌ నుంచి అనుమతులు తీసుకుని వాటన్నింటినీ పరిష్కరించిన తర్వాతనే కౌన్సెలింగ్‌ జరపాలంటూ పట్టుబట్టారు.

పోలీసులకు సమాచారం

ఇంతలో విద్యాశాఖ అధికారులు పోలీసులకు సమాచారం అందించగా.. రాప్తాడు పోలీసులు చేరుకున్నారు. అయినా ఉపాధ్యాయ సంఘాల నాయకులు వెనక్కి తగ్గలేదు. నిబంధనల మేరకు రావాల్సిన పాయింట్లు వేసే వరకు జరపకూడదంటూ తెగేసి చెప్పారు. దీంతో డీఈఓ పలుమార్లు ఆర్జేడీ, రాష్ట్ర అధికారులతో ఫోన్‌లో మాట్లాడాల్సి వచ్చింది.

150 మందికి మాత్రమే కౌన్సెలింగ్‌

తొలి 150 మందికి సంబంధించిన సీనియార్టీలో ఎలాంటి సమస్యలు లేకపోవడంతో చివరకు ఆ 150 మందికి మాత్రమే జరుపుతామన్నా సంఘాల నాయకులు ఒప్పుకోలేదు. చివరకు పలువురి జోక్యంతో వారికి కౌన్సెలింగ్‌ చేసేందుకు ఒప్పుకున్నారు. ఇదే విషయాన్ని డీఈఓ ప్రకటించారు. అయితే వారికి కూడా బుధవారం ఉదయం ఫైనల్‌ సీనియార్టీ జాబితాలో మార్పులు చేసి ప్రకటిస్తామని వెల్లడిస్తామన్నారు. దీంతో మధ్యాహ్నం నుంచి పడిగాపులు కాసిన వారు ఉసూరుమంటూ వెనుతిరిగారు.

ఫిర్యాదులను పట్టించుకోకుండా

ఎస్జీటీల బదిలీల కౌన్సెలింగ్‌కు సిద్ధమైన విద్యాశాఖ

అడ్డుకున్న ఉపాధ్యాయ సంఘాల

నాయకులు

8 గంటల ఆలస్యంగా 10.30 గంటలకు ప్రారంభమైన కౌన్సెలింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement