అరకొరలోనూ పచ్చనేతలకే ప్రాధాన్యం
సంప్రదాయ పంట వేరుశనగ సాగుకు సిద్ధమైన రైతులకు ప్రభుత్వం నుంచి తగినంత సబ్సిడీ విత్తనకాయలు అందేలా కనిపించడం లేదు. విత్తన పంపిణీ రిజిస్ట్రేషన్ ప్రక్రియే సక్రమంగా సాగడం లేదు. అవసరం మేరకు విత్తనకాయలు వచ్చే అవకాశం లేకుండా పోతోంది. దీంతో రైతులు ప్రైవేట్‌గా అదనపు ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.
జిల్లాలో 1.51 లక్షల హెక్టార్లలో
వేరుశనగ సాగుకు సన్నాహాలు
● ఎకరాకు 120 కేజీల చొప్పున
63,918 క్వింటాళ్ల విత్తనం అవసరం
● జిల్లాకు వచ్చింది కేవలం 26,784 క్వింటాళ్ల విత్తనమే
● నేటికీ ప్రారంభంకాని విత్తన పంపిణీ.. ఆందోళనలో అన్నదాతలు
హిందూపురం: ఖరీఫ్‌లో వేరుశనగ సాగుకు సిద్ధమైన రైతులకు రాయితీ విత్తనం అందడం అనుమానంగా మారింది. 40 శాతం రాయితీతో విత్తనం అందిస్తున్నామంటూ కూటమి సర్కార్ హడావుడి చేస్తున్నా... నేటికీ విత్తన పంపిణీ ప్రారంభించలేదు. పైగా అరకొరగా జిల్లాకు సరఫరా చేయడంతో విత్తనం అందే పరిస్థితి లేక సాగుకు ముందే రైతు చిత్తయిపోతున్నాడు.
జిల్లాకు చేరింది 26 వేల క్వింటాళ్లే
ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 2,69,152 హెక్టార్లు కాగా, ఇందులో ప్రధాన పంట వేరుశనగ 1,51,824 హెక్టార్లలో సాగులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం 63,918 క్వింటాళ్ల విత్తన వేరుశనగ అవసరంకాగా, జిల్లాకు నేటి వరకూ 26,784 క్వింటాళ్లు విత్తనం మాత్రమే అధికారులు పంపారు. పైగా నేటికీ విత్తన పంపిణీ ప్రారంభించలేదు. ఇక ధర విషయానికొస్తే కేజీ వేరుశనగ విత్తనం పూర్తి ధర రూ.93 కాగా, ప్రభుత్వం ప్రకటించిన 40 శాతం సబ్సిడీ రూ.37.20 పోను రైతు కేజీకి రూ.55.80 మేర చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా 30 కేజీల బస్తాకు రైతు తన వాటాగా రూ.1,694 చెల్లించాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ ఆలస్యం
విత్తన వేరుశనగ పంపిణీ కోసం రైతులు ముందుగా రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. జిల్లాలో 442 రైతు సేవా కేంద్రాలుండగా.. చాలా కేంద్రాల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్లు లేరు. దీంతో ఒక్కో అగ్రికల్చర్ అసిస్టెంట్‌కు రెండు రైతు సేవా కేంద్రాల బాధ్యతలు అప్పగించారు. ఆయా కేంద్రాల పరిధిలోని రైతులందరి రిజిస్ట్రేషన్ చేయాల్సిన బాధ్యత వారిదే. దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియనే ఆలస్యంగా సాగుతోంది.
ఎంత భూమి ఉన్నా 3 బస్తాలే
ఇప్పటికే జిల్లాకు చేరిన విత్తనకాయల్లోనూ పచ్చనేతలకే తొలి ప్రాధాన్యం ఇచ్చేలా అధికారులకు అనధికార ఆదేశాలు అందాయి. ఈనేపథ్యంలో ఈసారి ఖరీఫ్ వేరుశనగ సాగు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో చాలా మంది రైతులు ఇప్పటికే ఇతర జిల్లాలు, మండలాల్లోని రైతుల నుంచి విత్తనం తెచ్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఆమాత్రం స్థోమత లేని వారు ఈసారి భూములను బీళ్లుగా వదిలేసేందుకు సిద్ధమయ్యారు.
విత్తన వేరుశనగ పంపిణీలో ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఎకరం భూమి ఉన్న రైతుకు ఒక బస్తా (30కేజీలు).. రెండు ఎకరాలు ఉంటే 2 బస్తాలు, మూడు ఎకరాలకు 3 బస్తాల విత్తనమే ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే 3 ఎకరాలకు మించి ఎన్ని ఎకరాలున్నా గరిష్టంగా 3 బస్తాలు మాత్రమే ఇస్తామని అధికారులు చెబుతున్నారు. నీటి సౌకర్యం ఉన్న తోటల్లో ఎకరం వేరుశనగ సాగుకు 30 కేజీల బస్తాలు 4 సంచులు అవసరం అవుతాయి. అంటే 120 కేజీలు. ప్రభుత్వం గరిష్టంగా 3 బస్తాలు ఇస్తే ఎకరం కూడా పంటను సాగు చేయలేమని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ప్రైవేట్‌గా ఎక్కువ డబ్బు పెట్టి విత్తనం సమకూర్చుకోవాల్సి వస్తోందంటున్నారు.
అరకొరలోనూ పచ్చనేతలకే ప్రాధాన్యం
అరకొరలోనూ పచ్చనేతలకే ప్రాధాన్యం


