బడిబస్సూ పాస్‌ కావాల్సిందే! | - | Sakshi
Sakshi News home page

బడిబస్సూ పాస్‌ కావాల్సిందే!

Jun 7 2025 1:16 AM | Updated on Jun 7 2025 1:16 AM

బడిబస

బడిబస్సూ పాస్‌ కావాల్సిందే!

చిలమత్తూరు: వేసవి సెలవులు ముగిసి మరో వారంలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఆలోపే పాఠశాల బస్సులకు ఫిట్‌నెస్‌ (ఎఫ్‌సీ) పరీక్షలు చేయించుకోవాలని రవాణాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎఫ్‌సీ చేయించుకోని బస్సులను ఎట్టిపరిస్థితుల్లోనూ రోడ్డుపైకి ఎక్కనివ్వబోమని తేల్చిచెప్పారు. విద్యార్థులను తరలించే వాహనాలకు అన్నీ పక్కాగా ఉండాలని చెబుతున్నారు. కానీ జిల్లాలోని కొన్ని పాఠశాలల యాజమాన్యాలు బస్సుల ఫిట్‌నెస్‌పై దృష్టి సారించలేదు.

జిల్లా వ్యాప్తంగా 512 స్కూల్‌ బస్సులు..

జిల్లా వ్యాప్తంగా 512 ప్రైవేటు స్కూల్‌ బస్సులు ఉన్నాయి. ఇప్పటి వరకూ 436 బస్సులకు మాత్రమే ఆయా యాజమాన్యాలు ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించాయి. మిగిలిన 76 బస్సులు ఇంకా ఫిట్‌నెస్‌ టెస్ట్‌లు చేయించుకోవాల్సి ఉంది. ఈ నెల 15వ తేదీ వరకే గడువు ఉన్నా... ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఆ దిశశగా అడుగులు వేయడం లేదు. ఫిట్‌నెస్‌ ఉంటే తప్ప ఆ బస్సులు రోడ్డెక్కకూడదు. 15వ తేదీ తర్వాత ఫిట్‌నెస్‌ సామర్థ్యం లేని వాహనాలు రోడ్డెక్కితే సీజ్‌ చేస్తామని రవాణాశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. విద్యార్థుల భద్రత ప్రామాణికంగా విద్యాసంస్థలు వ్యవహరించాలంటున్నారు.

12 నుంచి బుక్కపట్నం కేంద్రంగా ఎఫ్‌సీ పరీక్షలు..

ఆర్టీఓ కార్యాలయాల్లో నిర్వహించే ఫిట్‌నెస్‌ పరీక్షలు ఈనెల 12వ తేదీ నుంచి జిల్లా కేంద్రం సమీపంలోని బుక్కపట్నంలో నిర్వహించనున్నారు. ప్రభుత్వం టెండరు ప్రక్రియ ద్వారా ఆటోమేటిక్‌ టెస్టింగ్‌ కేంద్రం (ఏటీసీ) నిర్వహణ బాధ్యతలు ప్రైవేటు సంస్థకు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 12వ తేదీ తర్వాత బుక్కపట్నంలోని ఏటీసీలో ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. పాఠశాలల బస్సులకూ ఇక్కడే ఎఫ్‌సీ చేయనున్నారు.

● బస్సు జీవిత కాలం తప్పనిసరిగా 15 ఏళ్ల లోపు ఉండాలి. బస్సుకు తప్పనిసరిగా పసుపు రంగు వేయించడంతో పాటు నాలుగు వైపులా పాఠశాల పేరు, ఫోన్‌ నంబర్‌ అందరికీ కనిపించేలా రాయించాలి.

● డ్రైవర్‌ వయస్సు 60 ఏళ్లు మించకూడదు. కనీసం ఐదేళ్ల అనుభవం ఉండి హెవీ డ్రైవింగ్‌ లైసెన్సు కలిగి ఉండాలి. మూడునెలలకు ఒకసారి డ్రైవర్‌కు బీపీ, షుగర్‌తో పాటు కంటిచూపు పరీక్షలు చేయించాలి. అటెండర్‌నూ తప్పక నియమించాలి .

● బస్సులో ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సు ఏర్పాటు చేయాలి. అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలి.

● అగ్నిప్రమాద సమయంలో మంటలు ఆర్పేందుకు అవసరమైన ఫైర్‌ ఎగ్జిస్టర్స్‌ ఉంచాలి.

● బస్సు ఎక్కేందుకు విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఫుట్‌బోర్డు ఏర్పాటు చేయాలి. కిటికీలకు బయటవైపు తప్పనిసరిగా గ్రిల్‌ ఏర్పాటు చేయాలి. ఇవన్నీ సవ్యంగా ఉంటేనే ఎఫ్‌సీ చేస్తారు.

స్కూల్‌ బస్సులకు

‘ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌’ తప్పనిసరి

పాఠశాలల పునఃప్రారంభంలోపు

ఎఫ్‌సీ చేయించుకోవాల్సిందే

15వ తేదీ వరకు గడువు విధించిన రవాణాశాఖ

నేటికీ రవాణా శాఖ కార్యాలయానికి

రాని 76 స్కూల్‌ బస్సులు

12 నుంచి బుక్కపట్నం ‘ఏటీసీ’లో ఎఫ్‌సీ పరీక్షలు

16 నుంచి స్పెషల్‌ డ్రైవ్‌

నిబంధనలు ఇవీ...

బడి బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు తప్పనిసరి. అన్ని పాఠశాలల యాజమాన్యాలకూ ఈ విషయాన్ని తెలియజేశాం. ఈ నెల 16 నుంచి జిల్లా వ్యాప్తంగా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తాం. ఎక్కడైనా ఫిట్‌నెస్‌ లేని స్కూల్‌ బస్సు కనిపిస్తే సీజ్‌ చేస్తాం. బడి బస్సులన్నింటికీ ఈ నెల 15వ తేదీలోపు ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించుకోవాలి. విద్యార్థుల భద్రతే మాకు ముఖ్యం. 12వ తేదీ తర్వాత ఫిట్‌నెస్‌ పరీక్షలు బుక్కపట్నంలో చేయించుకోవాల్సి ఉంటుంది.

– కరుణాసాగర్‌రెడ్డి, జిల్లా రవాణాశాఖ అధికారి

బడిబస్సూ పాస్‌ కావాల్సిందే! 1
1/1

బడిబస్సూ పాస్‌ కావాల్సిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement