బుళ్లసముద్రంలో చోరీ
మడకశిర రూరల్: మండలంలోని బుళ్లసముద్రం గ్రామంలో నివాసముంటున్న వైస్ ఎంపీపీ శ్రీరామరెడ్డి ఇంట్లో చోరీ జరిగింది. శ్రీరామరెడ్డి కుటుంబసభ్యులు గ్రామంలో తమకు తెలిసిన వారికి ఇంటి తాళం ఇచ్చి విజయవాడ వెళ్లారు. బుధవారం రాత్రి దుండగులు తాళం బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించి బీరువాలోని బంగారు ఆభరణాలు, నగదు, ఓ ద్విచక్ర వాహనాన్ని అపహరించుకెళ్లారు. చోరీ విషయాన్ని గురువారం ఉదయం గమనించిన స్థానికులు ఫోన్ ద్వారా శ్రీరామరెడ్డికి సమాచారం అందించారు. ఆయన ద్వారా విషయం తెలుసుకున్న సీఐ నగేష్‌బాబు వెంటనే గ్రామంలోని శ్రీరామరెడ్డి ఇంటికి చేరుకుని పరిశీలించారు. బంగారు ఆభణాలు, నగదుతో పాటు మొత్తం రూ.3 లక్షల వరకు చోరీ జరిగినట్లు గుర్తించారు. క్లూస్ టీంను రంగంలో దించి దుండగుల వేలి ముద్రలను సేకరించారు.
యువకుడి దుర్మరణం
నల్లమాడ: కారు ఢీకొన్న ఘటనలో ఓ ద్విచక్ర వాహనదారుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. నల్లమాడ మండలం దొన్నికోట గ్రామానికి చెందిన యనమల సోమశేఖరనాయుడు (30), సాయిలీల దంపతులకు మూడేళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు. బుధవారం భార్య, కుమారుడితో కలసి పుట్టపర్తి మండలం కంబాలపర్తిలోని అత్తారింటికి సోమశేఖర నాయుడు వెళ్లాడు. గురువారం ఉదయం కుటుంబంతో కలసి తన ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి తిరుగు ప్రయాణమైన నల్లమాడకు చేరుకోగానే తనకు పని ఉందంటూ భార్య, కుమారుడిని ఆటోలో ఎక్కించి పంపాడు. నల్లమాడలో పనిముగించుకున్న తర్వాత ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళుతున్న ఆయన.. ఎద్దులవాండ్లపల్లి తండా వద్దకు చేరుకోగానే చిల్లగోర్లపల్లికి వెళ్లే కాలిబాట వైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొంది. ప్రమాదంలో ద్విచక్రవాహనం రోడ్డు పక్కన ఉన్న గోతిలోకి దూసుకెళ్ల్లింది. సోమశేఖర నాయుడు గాలిలో ఎగిరి కొన్ని అడుగుల దూరంలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న భార్య అక్కడకు చేరుకుని బోరున విలపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతుని తండ్రి నారాయణస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
11వ రోజుకు చేరిన
రైతుల నిరసన
ముదిగుబ్బ: స్థానిక 342వ జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా చేపట్టిన భూసేకరణకు ఇచ్చే పరిహారంపై రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమం గురువారం 11వ రోజుకు చేరుకుంది. న్యాయమైన పరిహారం ఇచ్చే వరకూ పనులు అడ్డుకుంటామని రైతులు తెలిపారు. పని ప్రాంతంలో యంత్రాలను అడ్డుకున్నారు. కార్యక్రమంలో రైతులు సోమల ప్రకాష్‌నాయుడు, రాజేంద్రనాయుడు, హనుమంతు, ప్రసాద్, శంకర్, రమణ, సనత్‌కుమార్, ప్రభాకర్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.
బాల్య వివాహాన్ని
అడ్డుకున్న పోలీసులు
పెనుకొండ రూరల్: బాల్య వివాహాన్ని కియా పోలీసులు అడ్డుకున్నారు. పెనుకొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికతో చెన్నేకొత్తపల్లి మండలానికి చెందిన యువకుడితో వివాహం జరిపించేందుకు ఇరు కుటుంబాల పెద్దలు సిద్ధమయ్యారు. గురువారం ఉదయం కోన కణ్వాశ్రమంలో పెళ్లి తంతు జరుగుతుండగా సమాచారం అందుకున్న కియా ఎస్‌ఐ రాజేష్... సిబ్బందితో అక్కడకు చేరుకుని అడ్డుకున్నారు. బాలికతో పాటు తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలుచుకొచ్చి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు.
మోతాదుకు మించి
పురుగు మందులు వాడొద్దు
ముదిగుబ్బ: మోతాదుకు మించి పురుగు మందుల వాడకం వల్ల నష్టాలు అధికంగా ఉంటాయని రైతులకు రేకులకుంటలోని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ నారాయణస్వామి, డాక్టర్ కిషోర్‌రెడ్డి సూచించారు. వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా అధిక మోతాదులో ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల కలిగే నష్టాలపై గురువారం రైతులకు అవగాహన కల్పించారు. నూతన సాంకేతికత, కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ పథకాలు, వంగడాలు, డ్రోన్ స్ప్రేయింగ్ తదితర అంశాలను వివరించారు. పంటల సాగులో అనువైన విత్తనాలు, వాతావరణ పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చైతన్య పరిచారు. కార్యక్రమంలో ఏఓ లక్ష్మీనరసింహులు, ప్రొద్దుటూరు పశువైద్య కళాశాల అధ్యాపకుడు డాక్టర్ దీపక్, వ్యవసాయ విస్తరణాధికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బుళ్లసముద్రంలో చోరీ
బుళ్లసముద్రంలో చోరీ


