వెన్నుపోటు దినం సందర్భంగా పెనుకొండలో ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు
చంద్రబాబు అసమర్థ పాలనపై పెల్లుబుకిన ఆగ్రహం
కూటమి ఏడాది పాలనపై వెల్లువెత్తిన వ్యతిరేకత
ఊరువాడా కదం తొక్కిన జనం.. నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు
అడుగడుగునా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
వైఎస్సార్ సీపీ ‘వెన్నుపోటు దినం’ గ్రాండ్ సక్సెస్
చంద్రబాబు ఏడాది పాలనపై ప్రజాగ్రహం పెల్లుబుకింది. సీఎం డౌన్..డౌన్ నినాదం హోరెత్తింది. కూటమి సర్కార్ అసమర్థ పాలనకు వ్యతిరేకంగా ఊరూవాడా ఏకమైంది. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బుధవారం నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’లో ప్రజాగర్జన వినిపించింది. ప్రజలు స్వచ్ఛందంగా తరలిరాగా.. పట్టణాలన్నీ జనసాగరాలను తలపించాయి. పార్టీ శ్రేణులు కదం తొక్కగా వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడింది.
సాక్షి, పుట్టపర్తి: అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చి...ఏడాదిగా ఉలుకూపలుకూ లేకుండా ఉన్న చంద్రబాబు సర్కార్‌ను మేల్కొలిపేందుకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం జిల్లాలో విజయవంతమైంది. అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ శ్రేణులు కదం తొక్కారు. స్వచ్ఛందంగా తరలివచ్చిన జనంతో ర్యాలీలు నిర్వహించి.. అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. చంద్రబాబు మోసంపై దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు.
పుట్టపర్తిలో జనం కవాతు..
వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాజకీయ సలహా కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి శంకర్‌నారాయణ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆధ్వర్యంలో వేలాది మంది జనం భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు.
పెనుకొండలో జన ప్రభంజనం..
మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ఆధ్వర్యంలో యువకులు, రైతులు, మహిళలు, నిరుద్యోగులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆర్డీఓ కార్యాలయం వరకూ సాగింది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ఏఓ గిరిధర్‌నాయక్‌కు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు.
నినాదాలతో దద్దరిల్లిన ధర్మవరం..
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేతిరెడ్డి నివాసం నుంచి ప్రారంభమైన ర్యాలీ కాలేజీ సర్కిల్, కళాజ్యోతి సర్కిల్, పీఆర్‌టీ సర్కిల్ మీదుగా ధర్మవరం ఆర్డీఓ కార్యాలయం వరకూ సాగింది. ర్యాలీలో జనం ‘సీఎం డౌన్‌డౌన్’.. హామీల బాబు..అమలు ఎక్కడంటూ నినాదాలతో హోరెత్తించగా.. ధర్మవరం దద్దరిల్లింది. అనంతరం ఎన్నికల హామీలు అమలు చేయాలని ఆర్డీఓ మహేశ్‌కు వినతిపత్రం అందజేశారు.
హిందూపురం.. జనసాగరం..
నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక, పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి చౌళూరు మధుమతిరెడ్డి ఆధ్వర్యంలో వేలాది మంది పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ సర్కిల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు సీఎం.. డౌన్ డౌన్... పాలన చేతగాని చంద్రబాబు దిగిపోవాలని నినాదాలు చేశారు. తహసీల్దార్ వెంకటేశ్‌కు వినతిపత్రం అందజేశారు.
మడకశిరలో పెల్లుబికిన ప్రజాగ్రహం..
వైఎస్సార్ సర్కిల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు వైఎస్సార్ సీపీ జెండాలతో వేలాది మంది జనం చంద్రబాబు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని.. లేదంటే సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కరుణాకర్‌కు అందజేశారు.
కదిరిలో కదం తొక్కిన జనం..
వైఎస్సార్‌సీపీ హిందూపురం పార్లమెంట్ పరిశీలకులు రమేష్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కొనసాగిన ర్యాలీలో భారీగా జనం పాల్గొన్నారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ ఇందిరాగాంధీ సర్కిల్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది. ర్యాలీలో ప్రభుత్వ తీరును ఎండగడుతూ నినాదాలు చేశారు. అనంతరం ఇన్‌చార్జ్ తహసీల్దార్ ఈశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు.
రాప్తాడుకు క దిలివచ్చిన జనం
అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేయడం, వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు కొత్తేమీ కాదని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన ఆధ్వర్యంలో బుధవారం రాప్తాడులో నిర్వహించిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో వైఎస్సార్ సీపీ శ్రేణులు, మహిళలు పాల్గొన్నారు. ముందుగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ప్రజలకు చేసిందేమీ లేదు
అనంతరం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ విలేకరులతో మాట్లాడారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం దాదాపుగా రూ.1.50 లక్షల కోట్ల అప్పులు చేసినా...ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. సూపర్ సిక్స్‌తో పాటు 143 హామీలను గుప్పించి ఇంత వరకు ఒక్క హామీ అమలు చేయలేదని మండిపడ్డారు. పైగా ప్రశ్నించిన వారిపై కేసు బనాయించి భయాందోళనకు గురిచేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం మెడలు వంచైనా పథకాలు అమలు చేయించేలా వైఎస్సార్ సీపీ పోరాడుతుందన్నారు.


