నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక | - | Sakshi
Sakshi News home page

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

May 26 2025 1:40 AM | Updated on May 26 2025 1:40 AM

నేడు ప్రజా సమస్యల  పరిష్కార వేదిక

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

ప్రశాంతి నిలయం: కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ చేతన్‌ తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు తప్పకుండా హాజరుకావాలని సూచించారు.

పోలీస్‌ కార్యాలయంలో....

పుట్టపర్తి టౌన్‌: జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు ఎస్పీ వి.రత్న తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలను నేరుగా అందజేయవచ్చని సూచించారు.

చిన్నారిని మింగిన కరెంట్‌

పెనుకొండ: అభం శుభం తెలియని చిన్నారిని కరెంట్‌ షాక్‌ బలిగొంది. దేవుడా ఎంత పనిచేశావయ్యా అంటూ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా అత్తూరు తాలూకా మళ్లియకరై గ్రామానికి చెందిన అశోక్‌ పెనుకొండ నగర పంచాయతీ వెంకటాపురం తండా వద్ద ఉన్న రబ్బర్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. పక్కనే ఉన్న క్వార్టర్స్‌లో భార్య, ఇద్దరు పిల్లలతో నివాసముంటున్నాడు. ఆదివారం అశోక్‌ పని నిమిత్తం ఫ్యాక్టరీలోకి వెళ్లాడు. భార్య గాయత్రి బకెట్‌లో నీళ్లు పెట్టి వాటర్‌ హీటర్‌ స్విచ్‌ వేసింది. కాసేపటి తర్వాత పెద్ద కూతురు సెల్వ మౌలిక (7) అటువైపు వచ్చి బకెట్‌లోకి చేయి పెట్టగానే విద్యుత్‌షాక్‌కు గురైంది. వెంటనే భర్తను పిలిపించి కూతురును పెనుకొండ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే మౌలిక మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

అలరించిన సంగీత కచేరీ

ప్రశాంతి నిలయం: సత్యసాయిని కీర్తిస్తూ బాలవికాస్‌ చిన్నారులు నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను ఆలరించింది. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన ఒడిశా బాల వికాస్‌ చిన్నారులు ఆదివారం సత్యసాయి సన్నిధిలో సంగీత కచేరీ నిర్వహించారు. భక్తి గీతాలను చక్కటి స్వరాలతో ఆలపించారు.

40 శాతం రాయితీతో

విత్తన వేరుశనగ

అనంతపురం అగ్రికల్చర్‌: రైతులకు విత్తన వేరుశనగపై 40 శాతం రాయితీ వర్తింపజేసినట్లు వ్యవసాయశాఖ జేడీ కార్యాలయ వర్గాలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ ఏడాది 50,592 క్వింటాళ్ల వేరుశనగ కేటాయించారు. కే–6తో పాటు టీసీజీఎస్‌–1,694, కదిరి–లేపాక్షి (కే–1,812) విత్తన రకాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కే–6, టీసీజీఎస్‌–1,694 రకం క్వింటా పూర్తి ధర రూ.9,300 కాగా అందులో 40 శాతం రూ. 3,720 రాయితీ పోనూ రైతులు తమ వాటా కింద రూ.5,580 ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. కే–1,812 రకం పూర్తి ధర రూ.8,200 కాగా రూ.3,280 రాయితీ పోనూ రైతులు రూ.4,920 చెల్లించాలి. ఒక్కో రైతుకు గరిష్టంగా మూడు బస్తాలు (ఒక్కోటి 30 కిలోలు) పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక.. 30 శాతం రాయితీతో కందులు, మినుములు, పెసలు, 50 శాతం రాయితీతో కొర్రలు, రాగులు, 50 శాతం రాయితీతో జనుము, జీలుగ, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట విత్తనాలు రైతులకు జూన్‌ మొదటి వారంలో పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement