
రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు జాతీయ అవార్డు
పుట్టపర్తి అర్బన్: రైతు ఉత్పత్తి దారుల సంఘాలను ఏర్పాటు చేసి వ్యవసాయాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్న ముదిగుబ్బ, బత్తలపల్లి రైతు ఉత్పత్తిదారుల సంఘాలు జాతీయ అవార్డుకు ఎంపికయ్యాయి. గురువారం న్యూఢిల్లీలోని నాఫెడ్ కార్యాలయంలో ఆయా సంఘాల చైర్మన్లకు అవార్డులు అందజేశారు. నాఫెడ్ ఎండీ దీపక్ అగర్వాల్ చేతుల మీదుగా ముదిగుబ్బ ఎఫ్‌పీఓ చైర్మన్ , సీఈఓ చంద్రమోహన్, సతీష్ బత్తలపల్లి ఎఫ్‌పీఓ చైర్మన్, సీఈఓ కరుణాకర్‌రెడ్డి, పవన్‌కుమార్‌లకు అవార్డులను అందజేశారు. సంఘాల నిర్వహణ, నాయకత్వం, వ్యాపార టర్నోవర్, ప్రభుత్వ సంస్థలతో అనుసంధానం వంటి వాటిలో ప్రగతి సాధించినందుకు ఈఅవార్డులను అందజేశారు. దేశ వ్యాప్తంగా 1280 సంఘాలు ఉండగా అందులో 12 సంఘాలను ఎంపిక చేసినట్లు చెప్పారు.
వివాహిత అనుమానాస్పద మృతి
రొద్దం: మండలంలోని శ్యాపురం గ్రామ సమీపంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు... కర్ణాటకలోని హుసేన్‌పురం గ్రామానికి చెందిన చెన్నకేశవులు భార్య గాయత్రి (29)రెండు రోజుల క్రితం కుటంబ సభ్యులతో గొడువ పడి ఇంటిి నుంచి బయటకు వచ్చేసింది. గురువారం శ్యాపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో చెట్టుకు వేసుకున్న ఉరికి విగతజీవిగా వేలాడుతూ కనిపించడంతో గమనించిన పశువుల కాపరుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. లభ్యమైన ఆధారాలను బట్టి మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని ఆత్మహత్య చేసుకున్నది గాయత్రినేనని నిర్ధారించారు. దుస్తులపై రక్తపు మరకలు ఉండడంతో ఆమె మృతిపై తల్లి మంజులమ్మ అనుమానాలు వ్యక్తం చేశారు. తన కుమార్తె మృతికి భర్త చెన్నకేశవులు, ఆయన కుటుంబసభ్యులే కారణమంటూ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
బైక్‌పై నుంచి కిందపడి వృద్ధురాలు..
బత్తలపల్లి: ద్విచక్ర వాహనంపై నుంచి అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ వృద్ధురాలు మృతిచెందింది. పోలీసులు తెలిపిన మేరకు... బత్తలపల్లి మండలం నల్లబోయనపల్లి ఎస్సీ కాలనీకి చెందిన సాకే పెద్దక్క (76) బుధవారం మధ్యాహ్నం గ్రామంలోని స్టోర్ వద్దకెళ్లి బియ్యం తీసుకుంది. అనంతరం వరుసకు మనువడైన సాకే హరీష్‌తో కలసి ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరుగు ప్రయాణమైంది. హరీష్ అతివేగంగా, అజాగ్రత్తగా వాహనాన్ని నడపడంతో వెనకాల కూర్చొన్న పెద్దక్క.. గ్రామ సమీపంలోకి చేరుకుంటుండగా కళ్లు తిరిగి రోడ్డుపై పడిపోయింది. గమనించిన అదే కాలనీకి చెందిన వారు ఆమెను వెంటనే అంబులెన్స్‌లో బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి ఆమె మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ద్విచక్ర వాహనాల ఢీ..
ఇద్దరి దుర్మరణం
● మృతులు బిహార్ వలస కార్మికులు
రొద్దం: ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో బిహార్‌కు చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. మరోఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. బిహార్‌కు చెందిన రాహుల్ (20), మహమ్మద్ సుబహాన్ (40) బతుకు తెరువు కోసం వలస వచ్చి రొద్దంలో స్థిరపడ్డారు. వీరిలో స్థానికంగానే ఓ వెల్డింగ్ షాప్‌లో రాహుల్, ఎస్టేట్‌లో మహమ్మద్ సుబహాన్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. గురువారం లక్సానిపల్లిలో వెల్డింగ్ పనులు ముగించుకుని రొద్దం వైపు ద్విచక్ర వాహనంలో వెళుతుండగా... కల్లుకుంట క్రాస్ వద్ద నల్లూరు వైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన మరో ద్విచక్ర వాహనదారుడు ఢీకొన్నాడు. ఘటనలో బిహారీలు ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మహమ్మద్ సుబహాన్ కుమారుడితో పాటు మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు 108 ద్వారా పెనుకొండలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై రొద్దం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కారు ఢీ – వ్యక్తి మృతి
కదిరి అర్బన్: కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు... కదిరి మండలం కాళసముద్రం గ్రామానికి చెందిన నాగలక్ష్మి, తన కుమారుడు ఆదినారాయణ (35)తో కలసి గురువారం ఉదయం కదిరికి బేల్దారి పనుల కోసం వచ్చారు. పని ముగించుకుని రాత్రికి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు. కాళసముద్రం సమీపంలోని గురుకుల పాఠశాల వద్దకు చేరుకోగానే జాతీయ రహదారిపై వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన నాగలక్ష్మి, ఆదినారాయణను స్థానికులు కదిరిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆదినారాయణ మృతి చెందినట్లు నిర్ధారించారు. పరిస్థితి విషమంగా ఉన్న నాగలక్ష్మికి ప్రథమ చికిత్స నిర్వహించి, మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి రెఫర్ చేశారు. కాగా, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఘటనపై కదిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు జాతీయ అవార్డు