
ప్రశాంతంగా ‘నీట్’
అనంతపురం: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్–యూజీ 2025) ప్రశాంతంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఆరు పరీక్ష కేంద్రాలు (అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాయ్స్), ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఎస్కేయూ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్, జేఎన్‌టీయూ–ఏ ఇంజినీరింగ్ కళాశాల, కేఎస్‌ఎన్ ప్రభుత్వ ఉమెన్స్ కళాశాల, ఏపీ మోడల్ జూనియర్ కళాశాల– గుత్తి) ఏర్పాటు చేశారు. 2,613 మందికి గాను, 2,534 మంది (96.97 శాతం) హాజరయ్యారు. 79 మంది గైర్హాజరయ్యారు.
తల్లిదండ్రులకు తప్పని ఇక్కట్లు..
నీట్ రాయడానికి అభ్యర్థులతో పాటు వచ్చిన తల్లిదండ్రులకు ఇక్కట్లు తప్పలేదు. ఎస్కేయూ ఇంజినీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రం ఎస్కేయూ ప్రధాన ద్వారానికి చాలా దూరంగా ఉంటుంది. తల్లిదండ్రులు అందరినీ ప్రధాన ద్వారం వద్దే ఆపేశారు. ఎస్కేయూ ప్రధాన ద్వారం వద్దే ఆపివేయడంతో తల్లిదండ్రులు మండుటెండల్లో రోడ్డుపైనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎస్కేయూ ఉద్యోగుల క్వార్టర్స్‌లో ఉండే ప్రొఫెసర్లు వారికి మంచినీరు ఇచ్చి దాహం తీర్చారు. అతి పెద్ద క్యాంపస్ అయిన ఎస్కేయూ లోపలికి తల్లిదండ్రులను కూడా అనుమతించి ఉంటే క్యాంటీన్ వద్దో.. ఇతరత్రా భవనాల వద్ద కూర్చుని ఉండేవారు. ఉదయం 11 గంటలకు లోపలికి వెళ్లిన అభ్యర్థులు సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాలేదు. ఈ క్రమంలో తల్లిదండ్రులు బయటే మండుటెండలో వేచి ఉన్నారు.

ప్రశాంతంగా ‘నీట్’