
జిల్లా వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం
పుట్టపర్తి టౌన్: జిల్లా వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేసినట్లు డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాకు ఎస్పీ మాధవరెడ్డి వివరించారు. ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా అన్ని జిల్లాల ఎస్పీలతో గురువారం డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా నుంచి ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ... కౌంటింగ్ రోజు, ఆ తర్వాత రోజు జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్న భద్రతా చర్యలను వివరించారు. సమస్మాత్మక ప్రాంతాల్లో సాయుధ బలగాలతో పికెట్లు ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద రెండు కిలోమీటర్ల దూరం వరకూ రెడ్‌జోన్‌గా ప్రకటించినట్లు తెలిపారు. కాన్ఫరెన్స్‌లో ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ విష్ణు, డీఎస్పీలు వాసుదేవన్, శ్రీలత, కంజాక్షన్, శ్రీనివాసులు, ఎస్‌బీ సీఐ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, విక్రమ్, ఎస్‌ఐ ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు.
విధుల్లో అప్రమత్తంగా ఉండండి:
కౌంటింగ్ ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఎస్పీ మాధవరెడ్డి ఆదేశించారు. కౌంటింగ్ విధుల నిమిత్తం వివిధ జిల్లాల నుంచి వచ్చిన సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బందితో గురువారం తన కార్యాలయంలో ఆయన సమీక్షించారు. కేటాయించిన ప్రాంతాల్లో అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలన్నారు. ట్రబుల్ మాంగర్లు, నేర ప్రవృత్తి కలిగిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. గొడవలు జరిగే ప్రాంతాలను ముందుగా పసిగట్టి అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. కౌంటింగ్ పాసులు ఉంటేనే లోపలికి అనుమతించాలన్నారు. అభ్యర్థుల ఇళ్లపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. కౌంటింగ్ సెంటర్లలో ఏజెంట్లు దురుసుగా ప్రవర్తిస్తే వెంటనే అదుపులోకి తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, సైబర్ సెల్ సీఐ హేమంత్‌కుమార్, ఎలక్షన్ సీఐ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment