
మృతురాలు ఆదెమ్మ
నల్లచెరువు: జీవితంపై విరక్తితో ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... నల్లచెరువు మండలం దామవాండ్లపల్లికి చెందిన మల్లికార్జున బుధవారం తన భార్యతో కలసి సమీప బంధువుల ఇంటికి వెళ్లాడు. సాయంత్రం 4 గంటలకు తిరిగి స్వగ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఇంటి వద్ద ఉండాల్సిన తల్లి పూలకుంట ఆదెమ్మ (68) కనిపించకపోవడంతో చుట్టుపక్కల ఆరా తీశారు. చింత తోపు వైపు ఆమె వెళ్లినట్లుగా చూసిన వారు తెలపడంతో అటుగా వెళ్లి గాలింపు చేపట్టారు. అదే సమయంలో గ్రామానికి చెందిన కృష్ణమ్మ ఎదురుపడి ఆదెమ్మ చెప్పులు మాదిగోళ్ల బావి వద్ద ఉన్నాయని తెలపడంతో కుమారుడు అటుగా వెళ్లి పరిశీలించాడు. ఎక్కడేగాని ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. అప్పటికే చీకటి పడడంతో ఇంటికి చేరుకున్న మల్లికార్జున గురువారం ఉదయం గ్రామస్తులతో కలసి మరోసారి బావి వద్దకు చేరుకున్నాడు. అప్పటికే బావిలో ఆదెమ్మ మృతదేహం తేలియాడుతూ కనిపించింది. తన తల్లికి నెల రోజుల క్రితం కుక్క కరిచిందని, ఆపరేషన్ చేసి కుట్టు కూడా వేశారని ఈ సందర్భంగా మల్లికార్జున తెలిపాడు. అప్పటి నుంచి మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్న ఆమె జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నట్లుగా చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.