
మాట్లాడుతున్న ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్
అనంతపురం: డిసెంబర్ తొమ్మిదో తేదీ నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ కోరారు. ఉమ్మడి జిల్లాల ఎస్పీలతో బుధవారం ఆయన తన చాంబర్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులకు పరిష్కారం చూపాలన్నారు. పోక్సో బాధితులకు పరిహారం అందజేయాలని నిర్ణయించారు. సమావేశంలో శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవ్‌రెడ్డి, అనంతపురం ఏఎస్పీ ఆర్.విజయభాస్కర్‌రెడ్డి, సెబ్ అధికారి రామకృష్ణ, శ్రీ సత్యసాయి డీఆర్‌ఓ కొండయ్య తదితరులు పాల్గొన్నారు.
పార్ట్ టైమ్ ఉద్యోగుల
వేతనం పెంపు
పుట్టపర్తి: కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైమ్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఒకేసారి రెండింతలకు పైగా జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వారు రిక్రూట్ అయినప్పటి నుంచి రూ.12 వేల వేతనంతో పని చేస్తున్నారు. డిసెంబర్ నుంచి రూ.26,759 వేతనం తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (ఎస్పీడీ) శ్రీనివాసరావు జారీ చేశారు. దీంతో పాటు 40 పీజీటీ పోస్టుల భర్తీకి చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
నేడు కనకదాస జయంతి
పుట్టపర్తి అర్బన్: ఆధునిక కవి, సంగీతకారుడు, స్వరకర్త కనకదాస జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లోని స్పందన సమావేశ మందిరంలో కనకదాస జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ అరుణ్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు.