
పుట్టపర్తి ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం
పుట్టపర్తి అర్బన్: తప్పుల్లేని ఓటరు జాబితాకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని ఆర్డీఓ భాగ్యరేఖ కోరారు. మంగళవారం ఆమె తన కార్యాలయంలో ఎన్నికల అధికారులు, అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.... జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్ల వయస్సు పూర్తయ్యే యువత ఓటరుగా నమోదు చేసుకోవచ్చన్నారు. ఫారం 6, 7, 8లలో ఏవైనా అభ్యంతరాలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. వాటన్నింటి పరిశీలించి డిసెంబర్ 26వ తేదీ నాటికి క్లెయింలు పూర్తిగా పరిష్కరిస్తామన్నారు. 2024 జనవరి 5వ తేదీన ఓటరు తుది జాబితాను ప్రచురించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నవీన్‌కుమార్, డీటీ నరసింహులు, టీపీఓ ధర్మరాజు, అన్ని పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
దరఖాస్తుల వెల్లువ
● ఐసీడీఎస్‌లో22 పోస్టులకు
849 దరఖాస్తులు
పుట్టపర్తి అర్బన్: ఐసీడీఎస్‌లో పోస్టులకు భారీగా దరఖాస్తులు అందాయి. జిల్లాలో ఖాళీగా ఉన్న 22 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా, దరఖాస్తు స్వీకరణకు చివరిరోజైన నవంబర్ 8వ తేదీ సాయంత్రం వరకూ 849 దరఖాస్తులు అందినట్లు ఐసీడీఎస్ పీడీ లక్ష్మీకుమారి తెలిపారు. డీసీపీఓ పోస్టుకు 50, పీఓ పోస్టుకు 77, పీఓ ఎన్‌ఐసీ పోస్టుకు 73, ఎల్‌సీఓ పోస్టుకు 7, కౌన్సెలర్ పోస్టుకు 67, అకౌంటెంట్ పోస్టుకు 95, డేటా అనలిస్ట్‌కు 96, సహాయ డీఈఓకు 159, అవుట్ రీచ్ వర్కర్ పోస్టుకు 113, మేనేజర్ పోస్టుకు 34, సోషల్ వర్కర్‌కు 29, ఏఎన్‌ఎం పోస్టులకు 21, ఆయా పోస్టులకు 19, చౌకీదార్‌కు 8, వైద్యుని పోస్టులు ఒక దరఖాస్తులు అందినట్లు వెల్లడించారు. వాటిని పరిశీలించి 419 దరఖాస్తులను అర్హమైనవిగా నిర్ధారించామన్నారు. ఆయా పోస్టులకు ఈనెల 17, 18 తేదీల్లో సంస్కృతి ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటర్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఫలితాలను ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో నోటీస్ బోర్డులో ఉంచుతామని పీడీ వివరించారు.
నెట్టికంటుడి హుండీ ఆదాయం రూ.31.90 లక్షలు
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానానికి హుండీ కానుకల లెక్కింపు ద్వారా రూ.31.90 లక్షల ఆదాయం లభించినట్లు ఈఓ పట్టెం గురుప్రసాద్ తెలిపారు. భక్తులు హుండీ ద్వారా సమర్పించిన కానుకల లెక్కింపు మంగళవారం ఆలయంలో చేపట్టారు. 49 రోజులకు గాను హుండీ ద్వారా రూ.31,90,581, అన్నదాన హుండీ ద్వారా రూ.42,438 వచ్చిందని ఈఓ తెలిపారు. ఆలయ అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు హుండీ లెక్కింపు పర్యవేక్షించారు. ఆర్టీసీ సేవాసమితి సభ్యులు, బళ్లారికి చెందిన వీరభద్రసేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
పీఎస్‌ఓలు విధుల్లో
అప్రమత్తంగా ఉండాలి
పుట్టపర్తి టౌన్: వీఐపీలకు భద్రత కల్పించడం సవాళ్లతో కూడుకున్నదని, అయినప్పటికీ విధుల్లో నిత్యం అప్రమత్తంగా ఉంటూ వీఐపీల రక్షణే ధ్యేయంగా పనిచేయాలని ఎస్పీ మాధవరెడ్డి సిబ్బందికి సూచించారు. మంగళవారం పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో పీఎస్‌ఓ ( పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్)లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాధవరెడ్డి భద్రతా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. అలాగే పీఎస్‌ఓలంతా ఫిట్‌గా ఉండేందుకు జిమ్, యోగాతో పాటు పరేడ్‌లో పాల్గొనాలని, ఆరోగ్య సూత్రాలు పాటించాలన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ విజయ్‌కుమార్, ఆర్‌ఐలు టైటాస్, నారాయణ, రాజశేఖరరెడ్డి, ఆర్‌ఎస్‌ఐ వెంకటేవ్వర్‌రావ్, ప్రసాద్, ప్రదీప్‌సింగ్, రాజు, పలువురు పీఎస్‌ఓలు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎస్పీ మాధవరెడ్డి

రాజకీయపార్టీల ప్రతినిధులతో మాట్లాడుతున్న ఆర్డీఓ భాగ్యరేఖ