
అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్ అరుణ్‌బాబు
పుట్టపర్తి అర్బన్: ‘స్పందన’లో అందే అర్జీలకు గడువులోపు మెరుగైన పరిష్కారం చూపాలని, గడువు దాటిన తర్వాత ఒక్క అర్జీ పెండింగ్‌లో ఉండకూడదని కలెక్టర్ అరుణ్‌బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘స్పందన’కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి 280 అర్జీలను అందాయి. కలెక్టర్ అరుణ్‌బాబు, డీఆర్‌ఓ కొండయ్య, ఆర్డీఓ భాగ్యరేఖ, సచివాలయాల నోడల్ ఆఫీసర్ శివారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య తదితరులు అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ‘జగనన్నకు చెబుదాం’ అర్జీల పరిష్కారంపై ప్రతి అధికారి వ్యక్తి గతంగా దృష్టి సారించి పరిష్కరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ప్రతి అర్జీని సీఎం కార్యాలయం మానిటర్ చేస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. అర్జీ గడువు దాటకుండా పరిష్కారం చూపి ప్రజలకు నమ్మకం కలిగించాలన్నారు. మండల స్థాయిలో వచ్చిన ‘స్పందన’ అర్జీలు అధికంగా పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే పరిష్కారం చూపాలన్నారు.
అక్టోబర్ 30 నాటికి భవన నిర్మాణాలు
పూర్తి కావాలి..
గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్‌బీకేలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు తదితర ప్రభుత్వం ప్రాధాన్యతా భవన నిర్మాణాలన్నీ అక్టోబర్ 30వ తేదీ నాటికి పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ ఇంజినీర్లు, ఎంపీడీఓలను కలెక్టర్ ఆదేశించారు. స్పందన అనంతరం ఆయన అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రతి అధికారి లక్ష్యాలను నిర్దేశించుకొని పనులు పూర్తి చేయాలన్నారు. పూర్తయిన వాటిని సంబంధిత శాఖలకు అప్పగించాలన్నారు. భవనాలకు సంబంధించి బిల్లులు పెండింగ్‌లో లేకుండా చూడాలన్నారు. 5 రోజుల్లో బిల్లులన్నీ అప్‌డేట్ చేసి క్లియర్ చేయాలన్నారు. జిల్లాలోని 833 భవనాల్లో 367 భవనాలు పూర్తి చేసి అప్పగించారని, తక్కిన 466 భవనాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. అదేవిధంగా హౌసింగ్, గడప గడపకూ మన ప్రభుత్వంలో మంజూరైన పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.
‘జగనన్న ఆరోగ్య సురక్షను’
విజయవంతం చేయండి
పైలెట్ ప్రాజెక్టు కింద పుట్టపర్తి మండలం జగరాజుపల్లిలో మంగళవారం నిర్వహించనున్న జగనన్న ఆరోగ్య సురక్షను విజయవంతం చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలన్నారు.
27న బుక్కపట్నంలో జగనన్నకు చెబుదాం..
ఈనెల 27వ తేదీ బుధవారం బుక్కపట్నంలో ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. స్థానిక రైతు భరోసా కేంద్రంలో నిర్వహించే కార్యక్రమం గురించి మండల వాసులకు తెలియజేయాలన్నారు. అలాగే ‘స్వచ్ఛతా హీ సేవ–2023’ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ చంద్రమౌళిరెడ్డి, పీఆర్ ఎస్‌ఈ గోపాల్‌రెడ్డి, డీపీఓ విజయ్‌కుమార్, జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు, ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్, డీఎంహెచ్‌ఓ కృష్ణారెడ్డి, డీసీహెచ్‌ఎస్ తిప్పేంద్రనాయక్, పరిశ్రమల శాఖ అధికారి చాంద్‌బాషా తదితరులు పాల్గొన్నారు.
స్పందనలో అందే అర్జీలన్నీ
సకాలంలో పరిష్కరించాలి
ప్రాధాన్యతా భవన నిర్మాణాలను
పూర్తి చేయండి
కలెక్టర్ అరుణ్‌బాబు
స్పందన అర్జీల్లో కొన్ని...
అగ్ని ప్రమాదంలో తన ఇల్లు కాలిపోగా, అధికారులు జగనన్న కాలనీలో ఇంటి స్థలం మంజూరు చేశారని, అయితే సదరు స్థలాన్ని కొంత మంది ఆక్రమించుకున్నారని అమడగూరుకు చెందిన అక్కమ్మ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్థలాన్ని తనకు స్వాధీనం చేసి న్యాయం చేయాలని కోరారు.
కొత్తచెరువు మండలం కేశాపురం గ్రామంలో నాలుగు రోజుల నుంచి విద్యుత్ సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నామని శ్రీనాథ్‌రెడ్డి, నాగేంద్ర, బాలప్ప, రజితమ్మ తదితరులు కలెక్టర్‌కు విన్నవించారు. వెంటనే గ్రామానికి విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాలన్నారు.
1980లో చిలమత్తూరు మండలం శెట్టిపల్లి గ్రామ పొలం సర్వే నంబర్ 215–7లోని 44 సెంట్లు భూమిని కొనుగోలు చేశానని, పట్టాదార్ పాస్ పుస్తకంలో ఎక్కించాలని రెవెన్యూ అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని నాగిరెడ్డి ఫిర్యాదు చేశారు. వివరాలన్నీ పరిశీలించి పట్టాదార్ పాస్ పుస్తకం మంజూరు చేయించాలని కోరారు.