
సమగ్రశిక్ష కార్యాలయంలో భద్రపరిచిన పాఠశాలల లైబ్రరీ పుస్తకాలు
రాప్తాడు రూరల్: పుస్తక పఠనం విద్యార్థి మేథోశక్తి పెంపునకు దోహదపడుతుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా విద్యార్థుల్లో పఠనాశక్తిని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో 1 నుంచి ఇంటర్ వరకూ అన్ని తరగతుల విద్యార్థులకు ఉపయోగపడేలా పాఠశాలల గ్రంథాలయాలకు పుస్తకాలను సమకూరుస్తోంది. పాఠశాలల్లో తప్పనిసరిగా వారానికి ఒక పీరియడ్‌ను పుస్తక పఠనానికి కేటాయించేలా ఆదేశాలు జారీ అయ్యాయి.
జిల్లాకు చేరుతున్న పుస్తకాలు..
జిల్లాలోని 1,182 ప్రాథమిక పాఠశాలలకు ఒక్కో పాఠశాలకు 29 టైటిళ్లతో కూడిన బుక్ సెట్, 204 ప్రాథమికోన్నత పాఠశాలలకు సంబంధించి ఒక్కో పాఠశాలకు 29 బుక్‌లతో కూడిన సెట్లు జిల్లా కేంద్రానికి చేరాయి. మొత్తం 1,386 పుస్తకాల సెట్లను అధికారులు సమగ్రశిక్ష కార్యాలయంలోని గోదాములో భద్రపరిచారు. ప్రాథమిక పాఠశాలలకు 51 బుక్‌ల సెట్లు, ప్రాథమికోన్నత పాఠశాలలకు 91 బుక్‌లతో కూడిన సెట్లు రావాల్సి ఉంది. 303 ఉన్నత పాఠశాలలకు 88 బుక్‌లతో కూడిన సెట్లు రానున్నాయి. 59 జూనియర్ కళాశాలలకు 77 బుక్‌లతో కూడిన సెట్లు రావాల్సి ఉంది. ఇవన్నీ వచ్చిన తర్వాత జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకు పంపుతారు. అక్కడి నుంచి పాఠశాలలకు సరఫరా చేయనున్నారు.
విద్యార్థులకు చాలా ఉపయోగకరం..
లైబ్రరీ పుస్తకాలు విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని డీఈఓ నాగరాజు అన్నారు. అభ్యాసన స్థాయిలు మెరుగుకు ఇవి దోహదపడతాయన్నారు. వారంలో ఒక పిరియడ్‌ను తప్పనిసరిగా లైబ్రరీలోని పుస్తకాలను చదివించేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
తొలివిడతగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు అందజేత
జిల్లాకు చేరిన 1,386 సెట్లు
ఒక్కో సెట్‌లో 29 రకాల పుస్తకాలు