
సదస్సులో ప్రసంగిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీనివాస్
అనంతపురం: న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీనివాస్ సూచించారు. న్యాయ సేవాధికార చట్టం కింద ప్రజా ప్రయోజన సేవల్లో శాశ్వత లోక్ అదాలత్ తప్పనిసరిగా పరిష్కారం అందిస్తుందన్నారు. న్యాయ సేవా సదన్‌లో శనివారం ప్రజా ప్రయోజన సేవ శాఖల ప్రభుత్వ అధికారులకు శాశ్వత లోక్ అదాలత్‌లో ప్రజా ప్రయోజన కేసుల పరిష్కారంపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల ప్రజా ప్రయోజన సేవల శాశ్వత లోక్ అదాలత్ ధర్మాససం చైర్మన్ జి.శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా ప్రయోజన సేవల శాశ్వత లోక్ అదాలత్ అటు రాజీమార్గంలో పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. రాజీ కాని పక్షంలో తీర్పు వెలువరించగల అధికారమూ కలిగి ఉంటుందన్నారు. శాశ్వత లోక్ అదాలత్ గురించి చైర్మన్ జి.శ్రీనివాసరావు వివరించారు. రాజీ కుదరని పక్షంలో ధర్మాసనం తీర్పు వెలువరిస్తుందని, ఇది అప్పీలు లేని శాశ్వత లోక్ అదాలత్ తీర్పు అవుతుందని స్పష్టం చేశారు. శాశ్వత లోక్ అదాలత్ సభ్యులు ఎం.రాజశేఖర్‌రెడ్డి, ప్రసంగించారు.