
అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ను కలిసేందుకు వచ్చిన బాధితులు
అనంతపురం క్రైం: ఆదరణ చిట్‌ఫండ్స్ బాధితులతో అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణం శనివారం కిటకిటలాడింది. దాదాపు వందకు పైగా బాధితులు ఎస్పీ అన్బురాజన్‌ను కలసి తమకు న్యాయం చేయాలంటూ వినతి పత్రాలు అందజేశారు. ఎస్పీ సూచన మేరకు అనంతపురం టూటౌన్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం బాధితులు మీడియాతో మాట్లాడారు. ఆదరణ చిట్‌ఫండ్స్, సొసైటీ తదితర పేర్లతో వందల కుటుంబాలను నిర్వాహకులు మోసం చేశారని వాపోయారు. కష్టార్జితంతో రూ.వంద కోట్లు కొల్లగొట్టి స్థిరాస్తులు కూడబెట్టుకుని చివరకు బోర్డు తిప్పేసిన మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకుని, తమ డబ్బు ఇప్పించాలని ఎస్పీని కోరినట్లు వివరించారు.
ప్రతి ఫిర్యాదుపై కేసు నమోదు..
ఒకేసారి పెద్ద ఎత్తున కరలిసేందుకు వచ్చిన ఆదరణ బాధితుల పట్ల ఎస్సీ అన్బురాజన్ సానుకూలంగా స్పందించారు. బాధితుల ప్రతి ఫిర్యాదునూ స్వీకరించి కేసు నమోదు చేయాలని సీఐ శివరాముడిని ఆదేశించారు. దీంతో టూటౌన్ పోలీసు స్టేషన్‌లో ముగ్గురు రైటర్లను ఏర్పాటు చేశారు. బాధితులు ఎక్కువ మంది పెద్ద మొత్తంలో చిట్స్, ఎఫ్‌డీలు చేసిన వారు కావడంతో ఎన్ని కోట్ల రూపాయలు మోసపోయారన్నది ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసుల నమోదు అనంతరం ఎస్‌బీ ఖాతాల్లో ఎంత, చిట్స్ రూపంలో ఎంత నగదు అందాల్సి ఉంది, ఫిక్స్‌డ్ డిపాజిట్లు కింద ఎంత ఉంది తేలనుంది.