పూడికతీతతో చెరువులకు పూర్వ వైభవం

ఓడీ చెరువు/నల్లమాడ/ధర్మవరం రూరల్ : ‘అమృత్ సరోవర్’ పథకం కింద చేపట్టిన పూడికతీత పనులతో చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి వాటికి పూర్వ వైభవం వస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ సెక్రటరీ తనూజ ఠాకూర్, ఈజీఎస్ డైరెక్టర్ చిన తాతయ్య అన్నారు. శుక్రవారం వారు కేంద్ర బృందంతో కలిసి జిల్లాలోని ఓడీచెరువు, నల్లమాడ, ధర్మవరం మండలాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ‘అమృత్ సరోవర్’ పథకంలో భాగంగా చేపట్టిన పనులను పరిశీలించారు. తొలుత ఓడీ చెరువు మండలం వెంకటాపురం గ్రామం దండియాల చెరువులో చేపట్టిన ‘అమృత్ సరోవర్’ పనులను పరిశీలించారు. పూడికతీత పనులు పూర్తయినట్లు రికార్డుల్లో నమోదు చేశారని, ఇక్కడ మాత్రం 25 శాతం పనులు కూడా పూర్తి చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు నెలల్లో పనులు పూర్తి చేయాలని ఎన్‌ఆర్‌ఈజీఎస్ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం సర్పంచు శివశంకర్‌రెడ్డి అధ్యక్షతన ఉపాధి కూలీలు, గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ప్రజల జీవన విధానం, పంటల సాగు, ఉపాధి కూలీలకు పనుల వల్ల కలిగే ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నల్లమాడ మండలంలోని చౌటకుంటపల్లి వద్ద రైతు గంగాధర్ పొలంలో ఉపాధి హామీ పథకం కింద సాగుచేసిన మామిడి తోటను పరిశీలించారు.
ఇంకుడు గుంతలతో భూగర్భజలాలు వృద్ధి..
సాయంత్రం కేంద్ర బృందం సభ్యులు కలెక్టర్ అరుణ్‌బాబుతో కలిసి ధర్మవరం మండలం బుడ్డారెడ్డిపల్లిలో చేసిన అమృత్ సరోవర్ పనులను తనిఖీ చేశారు. అక్కడే ఉన్న రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇంకుడు గుంతలతో భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయని, తద్వారా సాగునీటికి ఇబ్బందులు తప్పుతాయన్నారు. వీరి వెంట ఆర్డీఓ తిప్పేనాయక్, ఈజీఎస్ జాయింట్ కమిషనర్ శివప్రసాద్, డ్వామా పీడీలు వేణుగోపాల్‌రెడ్డి, రామాంజనేయులు, ధర్మవరం తహసీల్దార్ యోగీశ్వరీదేవి, ఎంపీడీఓ మమతాదేవి, ఓడీసీ ఎంపీటీసీ శ్రీనివాసులు, ఎంపీడీఓ పోలప్ప ఉన్నారు.
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ సెక్రటరీ తనూజ ఠాకూర్