
ఆలయ గోపురానికి మరమ్మతులు చేస్తున్న దృశ్యం
లేపాక్షి: పురావస్తు శాఖ తాజాగా చేపట్టిన చర్యలతో లేపాక్షి వీరభద్రస్వామి ఆలయం రూపురేఖలు మారనున్నాయి. దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం విజయనగర చివరి రాజుల కాలంలో నిర్మితమైన ఈ ఆలయంలో ఎన్నో అరుదైన శిల్పాలు, తైల వర్ణ చిత్రాలు ఉన్నాయి. విజయగనగర రాజుల శిల్ప కళావైభవానికి తార్కాణంగా నిలిచిన ఈ ఆలయ శిఖరాలపై నాడు గారతో పలురకాల బొమ్మలను అందంగా తీర్చిదిద్దారు. అనంతర కాలంలో నిరాదరణకు గురికావడంతో కొన్ని శిల్పాలను ముష్కరులు ధ్వంసం చేశారు. వర్షాలకు పైకప్పు కారడంతో తైల వర్ణ చిత్రాలు దెబ్బతిన్నాయి. పురావస్తు శాఖ ఆధీనంలోకి ఈ ఆలయం చేరిన తర్వాత శిల్పాలను, తైలవర్ణ చిత్రాలను యథావిధిగా ఉంచేందుకు పలు చర్యలు చేపట్టారు. దెబ్బతిన్న దేవతామూర్తుల బొమ్మలను పునరుద్ధరించేందుకు తాజాగా చర్యలు తీసుకున్నారు. దాదాపు ఆరు దశాబ్దాల క్రితం తీసిన ఫొటోలను ఆధారంగా చేసుకుని వీటిని పునరుద్ధరించనున్నారు. ఆలయానికి ప్రధానంగా ఐదు శిఖరాలు ఉండగా ఇందులో నాలుగు శిఖరాలపై శిథిలమైన బొమ్మల పునర్మిణం పూర్తయింది. ఈ శిఖారాలకు రంగులు వేస్తే మరింత అందంగా కనిపించే అవకాశం లేకపోలేదు.