● ప్రభుత్వ నిర్ణయం వెనక్కి
తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం
● రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగ సంఘ నాయకులు
నెల్లూరు సిటీ: కూటమి ప్రభుత్వం నెల్లూరు నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ డిపో–2ను మూసివేసి రూ.300 కోట్లు విలువ చేసే ఐదెకరాల భూమిని పినాకిల్ ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టడం దారుణమని రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగ సంఘ నాయకులు ధ్వజమెత్తారు. నగరంలోని రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో వివిధ సంఘాల నాయకులు శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అజయ్‌కుమార్ మాట్లాడుతూ ఎలక్ట్రికల్ బస్సులు నిర్వహణ పేరుతో ప్రైవేట్ కంపెనీకి విలువైన భూమిని కట్టబెట్టడం దారుణమని తెలిపారు. ఇక్కడ పనిచేస్తున్న దాదాపు 500 మంది కార్మికులను ఇతర డిపోలకు బదిలీ చేస్తున్నారన్నారు. చుట్టు పక్కల గ్రామాలకు రోజూవారీ తిరుగుతున్న ఆర్టీసీ బస్సులను ఇతర డిపోలకు కేటాయిస్తుందన్నారు. దీంతో ఆయా ప్రాంతాలకు బస్సుల సంఖ్య తగ్గుతుందన్నారు. ఈ నెల 4న వీఆర్సీ సెంటర్ నుంచి ఆర్టీసీ బస్టాండు వరకు చలో ఆర్టీసీ–2 డిపో కార్యక్రమానికి పిలుపునిచ్చామన్నారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్ జిల్లా కార్యదర్శి రమణయ్య, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మధు, యానాదయ్య తదితరులు పాల్గొన్నారు.


