నెల్లూరు(బారకాసు): సిటీ నియోజకవర్గంలో 28 డివిజన్లు ఉన్నాయి. ఇందులో 42, 43, 44, 47 డివిజన్లలో మొక్కలు నాటేందుకు వీలుకాని పరిస్థితి. వాటిని మినహాయించి ఒక్కో డివిజన్‌లో 700 నుంచి 900 మొక్కలు చొప్పున మొత్తం 24 డివిజన్లలో 20 వేల మొక్కలు నాటాలని కార్పొరేషన్ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అయితే తెలుగు తమ్ముళ్ల కోసమే నారాయణ ఈ ప్లాన్ వేశారని ఆరోపణలున్నాయి. మొక్కలు నాటే పనులను ఆయా డివిజన్ టీడీపీ ఇన్‌చార్జిలకే కట్టబెట్టారు.
ఇష్టారాజ్యంగా..
టీడీపీ ఇన్‌చార్జిలు ఇష్టానుసారంగా మొక్కలు నాటిస్తున్నారు. ఏ డివిజన్‌లో ఎన్ని మొక్కలు నాటారో తెలియని పరిస్థితి. అంతేకాకుండా తమ ఇళ్ల ముందున్న రోడ్లు ధ్వంసం చేసేస్తున్నారంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో అడుగు ముందుకేసిన కొందరు తమ్ముళ్లు పలువీధుల్లో చెట్లు ఉన్నప్పటికీ కూడా వాటి పక్కనే గుంతలు తీసి మొక్కలు నాటేస్తున్నారు. ప్రధానమైన వీధుల్లో అయితే అసలు నాటిన పరిస్థితి కనిపించడం లేదు. వాస్తవానికి ప్రతి 15 అడుగులకు ఒక మొక్క నాటాలి. కానీ అలా కాకుండా డివిజన్ల ఇన్‌చార్జిలు వారికిచ్చిన టార్గెట్‌ను పూర్తి చేసేందుకు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత కార్పొరేషన్ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటం గమనార్హం.
అంత ఖర్చా?
మొక్కలు నాటేందుకు కార్పొరేషన్ అధికారులు టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. వీటిని టీడీపీ నేతలే దక్కించుకున్నారు. ఒక మొక్కను నాటి దానికి నెలరోజులపాటు నీళ్లు పోసి సంరక్షించేందుకు రూ.3,600 చొప్పున చెల్లించేలా నగరపాలక సంస్థ ఒప్పందం చేసుకుంది. ఇందులో మొక్క ఖరీదు రూ.625. సిమెంట్ రోడ్డును కటింగ్‌కు, ఆ తర్వాత గుంత కోసం డ్రిల్ వేయడం, మట్టిని లోడి మొక్కను నాటి పూడ్చడం అనంతరం దానికి గ్రీన్‌గార్డ్‌ను ఏర్పాటు, నెలరోజు లపాటు నీరు పోసి సంరక్షించేందుకు రూ.2,975 చెల్లించడం జరుగుతుంది. మొత్తం 24 డివిజన్లకు కలిపి సుమారు రూ.8 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. పనులు చేపట్టిన ఒక్కో టీడీపీ ఇన్‌చార్జికి సుమారు రూ.10 లక్షలు మిగిలే అవకాశం ఉందని తెలిసింది. తెలుగు తమ్ముళ్లకు దోచి పెట్టేందుకు మంత్రి నారాయణ తీసుకున్న చర్య లపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి నారాయణ ప్లాన్
మొక్కల పెంపకం పేరుతో నిధుల స్వాహా
టీడీపీ డివిజన్ ఇన్‌చార్జీలకే పనులు
నగరంలో 20 వేల మొక్కలు
నాటేందుకు రూ.8 కోట్లు
ఒక్క మొక్కకు ఖర్చు రూ.3,600
అధికార పార్టీ దోపిడీపై ప్రజల ఆగ్రహం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలుగు తమ్ముళ్లు చెలరేగిపోతున్నారు. ప్రకృతి వనరులను దోచుకుంటున్నారు. నెల్లూరు కార్పొరేషన్‌లో నిధుల స్వాహాకు తెరతీశారు. నగరంలో మొక్కల పెంపకం చేపట్టి గ్రీన్‌సిటీ గా మార్చి చూపిస్తానని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. కానీ ఇది తెలుగుదేశం నేతలకు దోచిపెట్టేందుకే
అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


