నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ వినియోగదారుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ‘డయల్ యువర్ ఎస్‌ఈ’ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నామని జిల్లా సర్కిల్ ఎస్‌ఈ రాఘవేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరులోని విద్యుత్ భవన్‌లో కార్యక్రమం జరుగుతుందన్నారు. వినియోగదారులు ఉదయం 8 నుంచి 9:30 గంటల మధ్య 0861 – 2320427 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు తెలియజేయాలని సూచించారు.
డ్రోన్ ద్వారా
పేకాట స్థావరం గుర్తింపు
● ఆరుగురి అరెస్ట్
పొదలకూరు: మండలంలోని నందివాయ అటవీ ప్రాంతంలో పోలీసులు ఆదివారం డ్రోన్‌ను ఎగురవేసి పేకాట స్థావరాన్ని గుర్తించారు. ఎస్సై హనీఫ్ ఆరుగురిని అరెస్ట్ చేసి రూ.12 వేలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు.
తల్లిదండ్రులు
మందలించారని..
● పదో తరగతి విద్యార్థి బలవన్మరణం
సోమశిల: పరీక్షల నేపథ్యంలో చదువుపై దృష్టి పెట్టమని తల్లిదండ్రులు మందలించి నందుకు ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆదివారం అనంతసాగరం మండలంలోని ఆమనిచిరివెళ్ల వద్ద చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గౌరవరం గ్రామానికి చెందిన చెలిక పెంచల య్య, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు చెలిక కుశ్వంత్ (15) మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతూ ప్రస్తుతం పబ్లిక్ పరీక్షలు రాస్తున్నాడు. ఈ సమయంలో విద్యపై దృష్టి పెట్టమని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన కుశ్వంత్ ఆమనిచిరివెళ్ల వద్ద ఉత్తర కాలువలో దూకాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్థానికుల సాయంతో కాలువలో గాలింపు చర్యలు చేపట్టగా సమీపంలోనే కుశ్వంత్ మృతదేహం లభ్యమైంది. చిన్న కారణానికి ఎంత పని చేశావురా అంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో గౌరవరంలో విషాదం నెలకొంది.
2న జిల్లా స్థాయి
వాటర్ స్పోర్ట్స్ పోటీలు
నెల్లూరు(టౌన్): శాప్‌లీగ్స్ – 2026లో భాగంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 2వ తేదీన స్వర్ణాల చెరువులో జిల్లా స్థాయి శాప్‌లీగ్స్ వాటర్ స్పోర్ట్స్ పోటీలు జరుగుతాయని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్‌కే జసీం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్స్, సబ్ జూనియర్స్ విభాగాల్లో బాలురు, బాలికలకు కేనోయింగ్, కయాకింగ్, రోయింగ్, డ్రాగన్ బోట్ విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. ఈవెంట్స్‌ల్లో పాల్గొనే వారు ఉదయం 8 గంటలకు ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో రిపోర్ట్ చేయాలన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు శాప్ అధికార వెబ్‌సైట్ www. sports. ap. gov. in శాప్ లీగ్స్ పోర్టల్లో లేదా క్రీడా యాప్‌లో ముందుగా పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. వివరాలకు 88622 38444 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలన్నారు.
శ్రీవారి దర్శనానికి
8 గంటలు
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 26 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. శనివారం అర్ధరాత్రి వరకు 82,040 మంది స్వామిని దర్శించుకున్నారు. 31,606 మంది తలనీలాలు అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.18 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. టికెట్లు లేనివారికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.


