నెల్లూను(వీఆర్సీసెంటర్): శ్రామిక మహిళా చట్టాలను అమలు చేయడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ దుగ్గిరాల అన్నపూర్ణమ్మ, సీఐటీయూ జిల్లా కార్యదరి గోగుల శ్రీనివాసులు, ఐద్వా జిల్లా జిల్లా కన్వీనర్ మస్తాన్‌బీ అన్నారు. నెల్లూరులోని డా.జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఆదివారం శ్రామిక మహిళా జిల్లా సమన్వయ కమిటీ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్కీమ్ వర్కర్లు దశలవారీ ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వాలు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైనట్లు ఆరోపించారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు రూ.3 వేలు సకాలంలో రావడం లేదన్నారు. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న మహిళా కార్మికులకు పురుషులతో సమానంగా కూలీలు ఇవ్వడం లేదన్నారు. సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి, మద్యం విక్రయాలు అధికమైనట్లు చెప్పారు. దీంతో యువత చెడుమార్గాల వైపు పయనిస్తోందన్నారు. గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం నిర్వహించిన నూతన కమిటీ ఎన్నికల్లో శ్రామిక మహిహిళా సంఘం జిల్లా కన్వీనర్‌గా మరోసారి దుగ్గిరాల అన్నపూర్ణమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో సీఐటీయూ, శ్రామిక మహిళా సంఘం, ఐద్వా, అంగన్‌వాడీ, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు టీవీవీ ప్రసాద్, శేషమ్మ, మధుసూదన, సుజాతమ్మ, మేరీ, ప్రభావతి, ఈశ్వరమ్మ, మణెమ్మ తదితరులు పాల్గొన్నారు.


