ఎన్నాళ్లీ కష్టాలు | - | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లీ కష్టాలు

Mar 28 2026 7:16 AM | Updated on Mar 28 2026 7:16 AM

గూడూరులో కృత్రిమ కొరత

సృష్టిస్తున్న ఏజెన్సీలు

అవస్థలు పడుతున్న ప్రజలు

మూతపడుతున్న హోటళ్లు

చిల్లకూరు: గూడూరులో గ్యాస్‌ ఏజెన్సీల నిర్వాహకులు శుక్రవారం పండగ పూట వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. మరో రెండు నెలలు వరకు గ్యాస్‌, పెట్రో ఉత్పత్తులకు ఎలాంటి ఢోకా లేదని కేంద్రం చెబుతున్నప్పటికీ స్థానికంగా ఉండే ఏజెన్సీలు, పెట్రోల్‌ దుకాణాల నిర్వాహకులు కృతిమ కొరతను సృష్టిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. గ్యాస్‌ సిలిండర్లను బ్లాక్‌మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అధికరేటు పెట్టి బ్లాక్‌లో కొనలేని కొందరు హోటళ్లను మూసివేశారు. గూడూరులో ఇప్పటికే పలు హోటళ్లు మూతపడగా, చిరు వ్యాపారాలు చేసే ఎందరో పేదలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీలు తమ సిబ్బందితో ఒక సిలిండర్‌ను రూ.2 వేల వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

బారులు తీరి..

పట్టణంలోని గ్యాస్‌ ఏజెన్సీల ఎదుట వినియోగదారులు సిలిండర్లతో బారులు తీరుతున్న పరిస్థితులున్నాయి. గంటలకొద్దీ వేచి చూస్తుండగా నిర్వాహకులు అరకొరగా సిలిండర్లను అందించి చేతులు దులుపుకొన్నారు. ఇంత జరుగుతున్నా సివిల్‌ సప్లయీస్‌ అధికారులు కనీసం తనిఖీలు కూడా చేయడం లేదని ఆరోపణలున్నాయి. వారికి భారీస్థాయిలో ముడుపులు ముడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. శివారు ప్రాంతంలోని టిడ్కో ఇళ్ల వద్దకు ఏజెన్సీ సిబ్బంది వచ్చి అధిక ధరకు సిలిండర్లు విక్రయిస్తున్నారని ఓ రెవెన్యూ అధికారికి ఫిర్యాదు అందింది. అంత దూరం తీసుకుని వచ్చి ఇవ్వడమే అదృష్టమని అధికారి అనడంతో వినియోగదారుడు నివ్వెరపోయాడు. గూడూరు ఆర్డీఓ గ్యాస్‌ ఏజెన్సీలపై దృష్టి సారించి తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement