సాక్షి, టాస్క్‌ఫోర్స్: సర్వేపల్లి ముఖ్య నేత అండదండలతో వెంకటాచలం మండలంలోని కాకుటూరులో సాగుతున్న భూ ఆక్రమణలపై కలెక్టర్ ఆరాతీస్తున్నారు. వీటిపై నివేదిక పంపాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ఓ వైపు సర్వేపల్లి ముఖ్య నేత, మరోవైపు నెల్లూరు నగరానికి చెందిన టీడీపీ కీలక నేతల కార్యాలయాల నుంచి రెవెన్యూ అధికారులపై ఒత్తిళ్లొస్తున్న క్రమంలో అక్రమలపై నిగ్గు తేలుస్తారా.. లేక తొక్కేస్తారాననే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
వెంటనే నివేదిక పంపండి
వెంకటాచలం మండలం కాకుటూరులో జాతీయ రహదారిని ఆనుకొని రూ.రెండు కోట్ల విలువజేసే ప్రభుత్వ భూమిని నెల్లూరు నగరానికి చెందిన ఓ టీడీపీ నేత దర్జాగా కజ్జా చేశారు. ఈ విషయమై భూమ్..ఫట్ అనే శీర్షికన సాక్షిలో కథనం గురువారం ప్రచురితమైంది. ఈ తరుణంలో ఈ వ్యవహారంపై కలెక్టర్ ఆరాతీశారని సమాచారం. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న విలువైన భూములు కబ్జాకు గురవుతుంటే, ఏమి చేస్తున్నారని.. దీనిపై నివేదికను పంపాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారని తెలుస్తోంది.
ఆక్రమణల జోలికెళ్లొద్దు
కలెక్టర్ ఆదేశాలతో మండల రెవెన్యూ అధికారుల్లో కదలికొచ్చింది. ఆక్రమిత భూముల్లో జరుగుతున్న నిర్మాణాలను నిలిపేయించేందుకు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో కబ్జా చేసిన నెల్లూరు నగరానికి చెందిన టీడీపీ నేత.. సర్వేపల్లి ముఖ్య నేతను ఆశ్రయించడంతో వెనక్కి తగ్గారు. వీరి నుంచి రెవెన్యూ అధికారులపై ఒత్తిళ్లు వస్తున్నాయని తెలుస్తోంది. దీంతో అక్కడ ఏమి జరుగుతోందో పరిశీలించేందుకు సైతం గ్రామానికి వెళ్లేందుకు వీరు జంకుతున్నారు.
మండిపడుతున్న గ్రామస్తులు
గ్రామంలో అంగన్‌వాడీ.. పాల కేంద్రాలు, లైబ్రరీ నిర్మాణాల కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిని ఇతరులు కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలను చేపట్టడంపై గ్రామస్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పార్టీలకతీతంగా ఏకమై కలెక్టర్ కార్యాలయ ఎదుట ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నారు. నివేదిక పంపాలనే కలెక్టర్ ఆదేశాలు ఓ వైపు.. ఆక్రమణల జోలికెళ్లొద్దంటూ టీడీపీ నేతల ఒత్తిళ్ల నేపథ్యంలో అధికారులు ఏమి చేస్తారో వేచి చూడాల్సి ఉంది.
కాకుటూరులో భూ ఆక్రమణలపై
నివేదికకు కలెక్టర్ ఆదేశాలు
రెవెన్యూ అధికారులపై కూటమి నేతల ఒత్తిళ్లు
ఆగని నిర్మాణ పనులు


