బ్రిడ్జి పైనుంచి పడిన ట్రాక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

బ్రిడ్జి పైనుంచి పడిన ట్రాక్టర్‌

Mar 28 2026 7:16 AM | Updated on Mar 28 2026 7:16 AM

వ్యక్తి మృతి

మర్రిపాడు: ట్రాక్టర్‌ బ్రిడ్జి పైనుంచి కేతామన్నేరు వాగులో పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై కదిరినాయుడుపల్లి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. బోగోలు మండలం తెల్లగుంట గ్రామానికి చెందిన వెంకటరమణయ్య (48), ఆత్మకూరు చందు ట్రాక్టర్‌లో ఫెన్సింగ్‌ స్తంభాలను వేసుకుని కావలి నుంచి పడమటినాయుడుపల్లి మజారా గ్రామమైన అనంతపురం వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో ట్రాక్టర్‌ బ్రిడ్జిపై నుంచి వాగులో పడిపోయింది. దీంతో వెంకటరమణయ్య అక్కడికక్కడే మృతిచెందగా, చందుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్‌, సీఐ గంగాధర్‌, మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ రాములు, ఏఎస్‌ఐ నజీర్‌ చేరుకుని పరిశీలించారు. ప్రమాదంపై పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య, ఒక బాబు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

జిల్లావ్యాప్తంగా నాకాబందీ

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌పై 33 కేసులు

నెల్లూరు(క్రైమ్‌): జిల్లా వ్యాప్తంగా పోలీస్‌ అధికారులు గురువారం రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు నాకాబందీ నిర్వహించారు. ప్రధాన కూడళ్లు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, హైవే ప్రవేశం తదితర ప్రాంతాల్లో 1,502 వాహనాలను తనిఖీ చేశారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న 33 మందిపై కేసులు నమోదు చేశారు. బహిరంగంగా మద్యం తాగుతున్న వారిపై 19 కేసులు పెట్టారు. రహదారి నిబంధనల ఉల్లంఘనులపై 39 కేసులు నమోదు చేసి రూ.1,41,450ల జరిమానా విధించారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రజలు తమ ప్రాంతాల్లో నేరాలు, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే డయల్‌ 112, పోలీస్‌ కంట్రోల్‌రూమ్‌ నంబర్‌ 9392903143కు తెలియజేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement