జలాశయాన్ని పరిశీలించిన నిపుణుల కమిటీ
రాపూరు: మండలంలోని కండలేరు జలాశయాన్ని బుధవారం నిపుణుల కమిటీ పరిశీలించింది. ప్రస్తుత నీటి నిల్వలు, విడుదల గురించి ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జలాశయంలో 60 టీఎంసీల నీరు ఉండటంతో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో ఆరా తీశారు. అనంతరం హైలెవల్, లోలెవల్ స్లూయీస్, హెడ్‌రెగ్యులేటర్‌ను బృందం పరిశీలించింది. హెడ్‌రెగ్యులేటర్ వద్ద ఉన్న గేట్లు చాలా కాలంగా ప్రెజర్ ఇస్తేనే పైకి లేస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం గేట్ల పరిస్థితిని పరిశీలించామని కమిటీ సభ్యులు తెలిపారు. నీరు తగ్గాక మరోసారి చూసి గేట్లు ఎందుకు పైకి రావడం లేదో తెలుసుకుంటామన్నారు. అప్పుడే గేట్లు మార్చాలా?, లేదా మరమ్మతులు చేపట్టాలా అనే విషయం చెప్పగలమన్నారు. ప్రస్తుతం నీరు ఉన్నందున చెప్పడం కష్టంగా ఉందన్నారు. నీరు తగ్గిన తర్వాత లీకేజీ ఎక్కడి నుంచి వస్తుంది?, ఎలా మరమ్మతులు చేపట్టాలో స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఈ కమిటీలో తిరుపతి క్యాలిటీ కంట్రోల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ శారద, నెల్లూరు తెలుగుగంగ ప్రాజెక్ట్ సూపరింటెండెంట్ ఇంజినీర్ సుబ్రహ్మణేశ్వరావు, ఈఈ గజేంద్రరెడ్డి, డీఈ నాగేంద్రబాబు, ఏఈ అనిల్ తదితరులున్నారు.


