తమిళనాడు నుంచి జిల్లా జలాల్లోకి బోట్లు
● సీఎంకు తెలిపిన కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు(దర్గామిట్ట): ‘తమిళనాడు నుంచి నెల్లూరు జిల్లాలోని సముద్ర జలాల్లోకి అక్రమంగా బోట్లు వస్తున్నాయి. అవి రాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలి’ అని కలెక్టర్ హిమాన్షు శుక్లా సీఎం చంద్రబాబును కోరారు. సీఎం ఆధ్వర్యంలో బుధవారం అమరావతిలోని సచివాలయంలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు హిమాన్షు శుక్లా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ పాండిచ్చేరి, కారైకల్ నుంచి వచ్చిన రెండు బోట్లను జువ్వలదిన్నె తీర ప్రాంతం వద్ద పట్టుకుని సీజ్ చేశామన్నారు. కొంతకాలం తర్వాత మరో రెండు బోట్లు రావడంతో వాటిని కూడా పట్టుకుని కేసులు పెట్టామన్నారు. తరచూ బోట్లు రావడం స్థానిక మత్స్యకారులకు ఇబ్బందిగా మారిందన్నారు. అలాగే వారికి ఉపాధి అవకాశాల కల్పనకు వివధ చర్యలను వివరించారు. ఖరీఫ్ సీజన్‌లో 1.50 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించాలని టార్గెట్ ఇచ్చారన్నారు. అయితే మిగిలిన జిల్లాలతో నెల్లూరును పోల్చుకుంటే ఇక్కడ ముందస్తు రబీ, లేట్ ఖరీఫ్ ఉంటుందన్నారు. అక్టోబర్ నెలలో 10,214 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. మిగిలింది లేట్ ఖరీఫ్‌లో కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇంకా ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన విషయాలను వెల్లడించారు.


