ఇసుకాసురుల బరితెగింపు
పొదలకూరు: నిబంధనలకు పాతరేసి ఇసుకాసురులు పెన్నానదిని కుళ్ల పొడుస్తున్నారు. ఇష్టానుసారంగా యంత్రాలు పెట్టి లోడేస్తూ భారీ వాహనాల్లో ఇసుకను బయటి రాష్ట్రాలకు తరలించి రూ.కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని చేస్తున్న ఈ తంతుపై ప్రశ్నించే అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్నారు.
మండలంలోని సూరాయపాళెం రీచ్‌లో డ్రెడ్జింగ్ ద్వారా ఇసుకను వెలికితీసి యార్డుకు తరలించి అక్కడి నుంచి అమ్మకాలు సాగించాలి. అయితే సంబంధిత కాంట్రాక్టర్ డ్రెడ్జింగ్‌కు నీళ్లొదిలి ఏకంగా యంత్రాలను వినియోగించి ఇసుకను లోడేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సంగం బ్యారేజీ నుంచి నీటి ప్రవాహం వల్ల విరువూరు ఓపెన్ రీచ్‌లో ఇసుకను తరలించడం లేదు. సూరాయపాళెం రీచ్‌లోనే ప్రస్తుతం లోడేస్తున్నారు.
రోడ్డు నిర్మాణం
ఇటీవల సోమశిల ప్రాజెక్ట్ నుంచి నీరు విడుదల చేయడంతో ప్రవాహం పెరిగి పెన్నా నదిలో ఇసుకను తీసేందుకు వీలుపడలేదు. దీంతో కొంతకాలం ఈ ప్రక్రియకు విరామం ప్రకటించారు. అయితే సూరాయపాళెం డ్రెడ్జింగ్ పర్మిట్‌ను అడ్డుపెట్టుకుని నేరుగా నది వద్దకు గ్రావెల్ రోడ్డు నిర్మాణం చేపట్టి భారీ యంత్రాలతో తవ్వకాలు చేస్తున్నారు. అక్కడే లారీలు, టిప్పర్లలో ఇసుకను లోడ్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. స్థానిక అధికారులు ప్రశ్నిస్తే ఇష్టం వచ్చిన కాకిలెక్కలు వెల్లడిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా మైనింగ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. నిబంధనల ప్రకారం డ్రెడ్జింగ్ అనుమతులు పొందిన కాంట్రాక్టర్ యంత్రాలను వినియోగించేందుకు వీల్లేదు. అంతేకాక నేరుగా నది సమీపానికి టిప్పర్లు, లారీలు వెళ్లకుండా దూరంగా యార్డును ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ అలాంటి నిబంధనలు పాటించడం లేదు.
డ్రెడ్జింగ్ లేకుండా
యంత్రాల వినియోగం
పెన్నానదిలోకి నేరుగా రోడ్ల నిర్మాణం
నిబంధనలకు తూట్లు
పట్టించుకోని అధికారులు
ఇసుకాసురుల బరితెగింపు


