నారాయణా.. మా మొర ఆలకించండి
● విధులు బహిష్కరించిన పారిశుద్ధ్య
కార్మికులు
● సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
● అడ్డుకున్న పోలీసులు
నెల్లూరు(బారకాసు): మంత్రి నారాయణ కార్మికుల మొర ఆలకించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం నుంచి పారిశుద్ధ్య, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ కార్మికులు, డ్రైవర్లు విధులు బహిష్కరించారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని మినీబైపాస్ రోడ్డులో అనిల్ గార్డెన్స్ వద్దనున్న పార్కు వద్దకు కార్మికులందరూ చేరుకున్నారు. భారీ ర్యాలీగా మంత్రి నారాయణ క్యాంపు కార్యాలయం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు భారీగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు యూనియన్ నాయకులతో చర్చలు జరిపారు. ర్యాలీ వద్దకు వచ్చిన మంత్రి పర్సనల్ సెక్రటరీ వెంకటేష్‌కు అర్జీని ఇచ్చి సమస్యల తీవ్రతను తెలియజేశారు. అనంతరం మాగుంట లేఅవుట్ నుంచి మినీ బైపాస్ వైపు కార్మికులు ర్యాలీ చేపట్టారు. సమస్యల పరిష్కారంపై స్పష్టత వచ్చేంత వరకు విధుల బహిష్కరణ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నెల్లూరు నగర గౌరవాధ్యక్షుడు కత్తి శ్రీనివాసులు, సీఐటీయూ నెల్లూరు రూరల్ కార్యదర్శి కె.పెంచలనరసయ్య మాట్లాడుతూ ఆప్కాస్ ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం 42 రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నారన్నారు. పాలకవర్గ సభ్యులు దిష్టిబొమ్మల్లా తయారయ్యారని, ప్రజా, కార్మికుల సమస్యలు గాలికొదిలేశారన్నారు. కార్యక్రమంలో నేతలు కొండా ప్రసాద్, జి.నాగేశ్వరరావు, సుధాకర్, నరసింహ, ఆర్‌ఎం సునీల్ కుమార్, సీహెచ్ మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నారాయణా.. మా మొర ఆలకించండి


