కూటమి పాలనలో దళితులకు అన్యాయం
● డీఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన
ఆత్మకూరు: ‘కూటమి పాలనలో దళితులకు న్యాయం జరగడం లేదు. సొంత పార్టీకి చెందిన వారైనా పట్టించుకోవడంలేదు’ అని పలువురు వాపోయారు. జనసేనకు చెందిన వ్యక్తి కులం పేరుతో దూషించి కర్రతో దాడి చేసిన విషయమై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో బాధిత దళితులు, పలు ప్రజా సంఘాల వారు ఆత్మకూరు డీఎస్పీ కార్యాలయం ఎదుట మంగళవారం బైఠాయించి నిరసన తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఈనెల 6వ తేదీన చేజర్ల మండలం నడిగడ్డ అగ్రహారానికి చెందిన దొంతల గంగయ్య అనే దళితుడు తన పొలంలో పశువులు మేపుతున్నాడు. సమీప పొలానికి చెందిన రైతు తాను సాగు చేస్తున్న పిల్లిపెసరలో పశువులు రాకుండా చూడాలని చెప్పి వెళ్లాడు. గ్రామానికి చెందిన జనసేన నాయకుడు కనకం సుధాకర్ తన మేకలను పిల్లిపెసరలో మేపుతున్నాడు. దీంతో గంగయ్య అడ్డుచెప్పాడు. సుధాకర్ కర్రతో గంగయ్యపై దాడి చేసి కులం పేరుతో దూషించి గాయపరిచాడు. ఈ వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఆరు రోజుల క్రితం ఆత్మకూరు డీఎస్పీ కె.వేణుగోపాల్‌ను బాధితులు కలవడంతో న్యాయం చేస్తానని చెప్పారు. కానీ కేసు కట్టకపోగా పలువురు బెదిరిస్తున్నాడని గంగయ్య వాపోయాడు. తాను టీడీపీ కార్యకర్తనేనని, దెబ్బలు తినేందుకే సభ్యత్వం ఇచ్చారా అని ప్రశ్నిస్తున్నాడు. న్యాయం జరగకపోవడంతో నిరసనకు దిగామన్నారు. డీఎస్పీ వేణుగోపాల్ కార్యాలయంలో అందుబాటులో లేరు. ఈ విషయమై నెల్లూరు స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ బాధితులకు ఫోన్ చేసి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆత్మకూరు పోలీసులకు ఫోన్ చేసి, కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్ కాపీ బాధితులకు ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ న్యాయ విభాగం అధ్యక్షుడు నందా ఓబులేసు, బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌చార్జి టి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


