బీమా రంగానికి తీవ్ర నష్టం
నెల్లూరు(అర్బన్): బీమా రంగంలోకి 100 శాతం విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో దేశ ఆర్థిక రంగానికి, ప్రజలకు తీరని నష్టం కలుగుతుందని ఎల్‌ఐఏసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా సీఏబీ కార్యదర్శి నరసింహులు అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం నెల్లూరులోని జ్యోతిరావు పూలే విగ్రహం సమీపంలో ఉన్న ఎల్‌ఐసీ సీఏబీ కార్యాలయం వద్ద ఆ బ్రాంచ్ ఏజెంట్లు నిరసన తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో బీమా రంగంపై విదేశీ పెత్తనం ఏర్పడుతోందన్నారు. ఇప్పటి వరకు ఎల్‌ఐసీ సేకరించే ప్రీమియం రైల్వే, రోడ్లు, నీటి పారుదల ప్రాజెక్టులు లాంటి వాటి కోసం ప్రభుత్వానికి పెట్టుబడుల రూపంలో అందించేదన్నారు. తాజా నిర్ణయంతో ప్రజలు చెల్లించే ప్రీమియంకి భద్రత లేకుండా పోతుందన్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఓఐ నాయకులు రజనీకాంత్, రషీద్ పాల్గొన్నారు.


