గంజాయి మాఫియాకు నేతల సాయం
● పెంచలయ్య కుటుంబానికి రూ.7.20 లక్షల సాయం
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘డబ్బుల కోసం గంజాయి మాఫియా ఏ స్థాయికైనా వెళ్తోంది. వారికి రాజకీయ నేతలు, పోలీసులు సాయం చేస్తున్నారు’ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు యు.వాసుకి అన్నారు. గంజాయి బ్యాచ్ చేతిలో హత్యకు గురైన పెంచలయ్య సంతాప సభను సోమవారం నెల్లూరులోని టౌన్‌హాల్లో నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ డ్రగ్స్ మాఫియాకు అవకాశాలు ఇవ్వకూడదన్నారు. పెంచలయ్య కుటుంబానికి సీపీఎం అండగా ఉంటుందన్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ కందుకూరులో రాజకీయ గొడవల్లో చనిపోయిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేసిందన్నారు. పెంచలయ్య సమాజంలో మార్పు తీసుకొచ్చే క్రమంలో హత్యకు గురయ్యాడన్నారు. అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చామన్నారు. అనంతరం పార్టీ సేకరించిన విరాళం రూ.7.20 లక్షలను పెంచలయ్య భార్య దుర్గకు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి పెంచలయ్య కుటుంబానికి రూ.లక్ష సాయం చేశారు. కార్యక్రమంలో వివిధ పార్టీ నేతలు మూలం రమేష్, అరిగెల నాగేంద్రసాయి, విఠపు బాలసుబ్రహ్మణ్యం, కత్తి శ్రీనివాసులు, రాంబాబు, లక్ష్మీరెడ్డి, బసవరాజు, శివశంకర్, మోహన్‌రావు, మాదాల వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, అజయ్‌కుమార్ పాల్గొన్నారు.


