పునర్విభజనపై నిరసన సెగలు
నెల్లూరు(అర్బన్): జిల్లాల పునర్విభజనపై నిరసన సెగలు రగులుతున్నాయి. కలువాయి, సైదాపురం, రాపూ రు మండలాలను యధాతధంగా నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని కోరుతూ ఆయా మండలాల ప్రజలు ప్రజాసంఘాల నాయకులతో కలిసి ఆందోళనలు చేపడుతున్నారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్ ఎదుట కలువాయి మండలంతో పాటు కండలేరు పునరావాస కాలనీలకు చెందిన ప్రజలు ప్రజా సంఘాల నేతలతో కలిసి నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. కొందరు అర్ధనగ్నంగా కూర్చుని ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ హిమాన్షుశుక్లాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు మిడతల రమేష్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ గూడూరు డివిజన్‌ను తిరిగి నెల్లూరు జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. గద్దెనెక్కాక ఆ హామీని మరిచి కలువాయి, సైదాపురం, రాపూరు ప్రాంతాలను కూడా తిరుపతి జిల్లాలో కలుపుతామనడం దుర్మార్గమన్నారు. కండలేరు జలాశయం విభజన మూలంగా నీటి యుద్ధాలు జరుగుతాయన్నారు. సోమశిల ప్రాజెక్టు నీటి వాటా విషయంలో కూడా ఇబ్బందులు వస్తాయన్నారు. కలువాయి నుంచి నెల్లూరుకు 60 కి.మీ దూరం కాగా తిరుపతికి 140 కి.మీ దూరం ప్రయాణించాల్సి వస్తుందన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఎవరి కోసమో జిల్లాను విభజిస్తే ఊరుకునేది లేదన్నారు. ఇందుకు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. చేనేత ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ బుధవారపు బాలాజీ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుంటే పవన్‌కళ్యాణ్ మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. బ్రిటిష్ పాలకుల కన్నా దుర్మార్గంగా కూటమి నేతలు వ్యవహరిస్తున్నారన్నారు. నాయకులు కందికట్ల రాజేశ్వరి, బైరి శ్రీనివాస్, సుబ్బారెడ్డి, బీసీ సంక్షేమ సంఘ అధ్యక్ష, ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, అనూరాధ, బీసీవై పార్టీ నేతలు హజరత్‌యాదవ్, గోపాల్, మనోహర్ హింద్, ఆనంద్, నరేష్, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు
కలువాయి(సైదాపురం): కలువాయి బస్టాండ్ సెంటర్‌లో జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం రిలే దీక్షలు చేపట్టారు. తొలుత ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. అనంతరం ఒంటికాలుపై నిలబడి తమ నిరసనను తెలియజేశారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద దివ్యాంగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలోనే కలువాయి మండలాన్ని ఉంచాలని, తిరుపతి జిల్లాలో కలిపితే కలిగే నష్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.
పునర్విభజనపై నిరసన సెగలు


