చంద్రబాబుకు రైతులపై కనికరం లేదు
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి
తోటపల్లిగూడూరు: దిత్వా తుపానుతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయినా చంద్రబాబు ఏ మాత్రం కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నాడని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని పాపిరెడ్డిపాళెంలో సోమ వారం ఆయన పర్యటించారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న నారుమళ్లు, పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ దిత్వా తుపానుతో కురిసిన భారీ వర్షాలకు నాట్లు, నారుమళ్లు దెబ్బతిని జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోయిందన్నారు. అయినా టీడీపీ ప్రభుత్వం రైతులను ఆదుకునే విషయంలో నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందన్నారు. సబ్సిడీ విత్తనాలను అందించే ఆలోచన చేయకపోవడంతో రైతులే నగదు వెచ్చించి కొనుగోలు చేసి మళ్లీ నారుమళ్లను సిద్ధం చేసుకుంటున్నారన్నారు. కనీసం రైతులకు నష్టపరిహారం అందించే దిశగా ఎలాంటి ఆదేశాలు కూడా జారీ చేయకపోవడం దురదృష్టకరమన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా చంద్రబాబు ప్రభుత్వం రైతులకు యూరియా కార్డులను పంపిణీ చేసి పరిమితి విధించడం దౌర్భాగ్యమన్నారు. రైతులు యూరియా బస్తాను రూ.850 నుంచి రూ.900 వరకు వెచ్చించి కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు, విత్తనాలు, యూరి యా, దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించకుండా టీడీపీ ప్రభుత్వం రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఆర్బీకేల ద్వారా రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు ఇంటి ముంగిటకే అందించామన్నారు. వైఎస్సార్ రైతుభరోసా పథకం కింద ఏటా రూ.13,500 వంతున పెట్టుబడి సాయం అందించామని గుర్తుచేశారు. ఏటా రూ.20 వేలు పెట్టుబడి సాయం అందిస్తానన్న చంద్రబాబు రెండేళ్లకు గానూ రూ.10వేలు రైతన్న చేతిలో పెట్టి మమ అన్పించాడన్నారు. వర్షాలకు నష్టపోతే సబ్సిడీపై విత్తనాలు, పంటల బీమా సాయాన్ని అందించి జగన్‌మోహన్‌రెడ్డి ఆదుకుంటే ప్రచార ఆర్భాటం తప్ప చంద్రబాబు రైతులకు చేసిందేమి లేదన్నారు. రాష్ట్రానికి కోట్ల రూపాయల పెట్టబడులు తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ఒక్క ఉద్వోగం ఇవ్వలేదన్నారు. నారా లోకే్‌శ్ రాష్ట్రంలో రైతుల పడుతున్న కష్టాలను పట్టించుకోకుండా విమాన సంస్థ ఇండిగో గురించి మాట్లాడడం చూసి జాతీయ మీడియా ఏకిపారేస్తుందన్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డికి అవినీతి సొమ్మును దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ ఓట్లేసి గెలిపించిన ప్రజల మీద లేదన్నారు. అవినీతే పరమావధిగా భావిస్తున్న సోమిరెడ్డిని సర్వేపల్లి ప్రజలు, రైతులు ఎప్పుడో మర్చిపోయారన్నారు. ఇప్పటికై నా చంద్రబాబు దిత్వా తుపాను నష్టాన్ని అంచనా చేయించి రైతులను ఆదుకోవాలని కాకాణి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యద ర్శి చిల్లకూరు సుఽధీర్‌రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి ఇసనాక రమేష్‌రెడ్డి, మండలాధ్యక్షుడు ఉప్పల శంకరయ్యగౌడ్, జెడ్పీటీసీ సభ్యులు ఎంబేటి శేషమ్మ, వైస్‌ఎంపీపీ చెరుకూరు శ్రీనివాసులనాయుడు పాల్గొన్నారు.


