డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద ధర్నా
నెల్లూరు(అర్బన్): ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న డాక్టర్ల సమస్యల ను పరిష్కరించేంత వర కు పోరాటం ఆగదని ఏపీ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్ల సంఘ జిల్లా అధ్యక్షుడు అమరేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లాలోని పీహెచ్‌సీల్లో వైద్యసేవలను ఆపేసి వైద్యులు చేపట్టిన సమ్మె గురువారంతో 19వ రోజుకు చేరుకుంది. నగరంలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. 20 నుంచి 25 ఏళ్లుగా ఎలాంటి ఉద్యోగోన్నతుల్లేకుండా ఒకే హోదాలో పనిచేస్తున్న డాక్టర్లకు టైమ్‌బౌండ్ ప్రమోషన్లను ఇవ్వాలని కోరారు. ఇన్ సర్వీస్ పీజీ కోటా పునరుద్ధరణ.. నోషనల్ ఇంక్రిమెంట్ల మంజూరు.. గిరిజన ప్రాంతాల్లో సేవలందిస్తున్న వైద్యులకు 50 శాతం మూలవేతనాన్ని గిరిజన భత్యంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్లు రవీంద్రరెడ్డి, టాగూర్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.


